
ఉపాధ్యాయుల సర్దుబాటు కొలిక్కి!
భువనగిరి: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. నిబంధనల ప్రకారం తొలుత స్కూల్ కాంప్లెక్స్, తర్వాత మండలం, అనంతరం ఇతర మండలాల్లోకి సర్దుబాటు చేయనున్నారు. కాగా మంగళవారం 44 మంది స్కూల్ అసిస్టెంట్‌ల(ఎస్‌ఏ)కు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
మొత్తం 2,745 మంది ఉపాధ్యాయులు
జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో గత ఆగస్టు నాటికి 35,558 మంది విద్యార్థులున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ఈ విద్యాసంవత్సరం మరో 5,846 అడ్మిషన్లు పెరిగాయి. ఉపాధ్యాయుల విషయానికొస్తే ఎస్జీటీలు 1,105, ఎస్‌ఏలు 1,640 మంది విధులు నిర్వహిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి పాఠశాలల పున:ప్రారంభంలోనే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. బడిబాట కార్యక్రమం ముగిసిన తర్వాత విద్యార్థుల సంఖ్యపై స్పష్టత వస్తుందని, అందుకు అనుగుణంగా సర్దుబాటు చేస్తే బాగుటుందని ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సర్దుబాటు ప్రక్రియ వాయిదా పడిది. ఈ నెల 15వ తేదీనాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ డీఈఓలను ఆదేశించింది. సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రావడంతో ఫైల్ కలెక్టర్‌కు చేరింది. కలెక్టర్ సంతకం చేస్తే మంగళవారం 44 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత 60 నుంచి 70 మంది వరకు ఎస్జీటీలను సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
ఫ తొలుత స్కూల్ అసిస్టెంట్ల కేటగిరీలో సర్దుబాటు
ఫ కలెక్టర్ వద్దకు చేరిన జాబితా
ఫ నేడు 44 మందికి ఉత్తర్వులు జారీ
ఫ ఆ తరువాత ఎస్‌జీటీలకు..
ఫ ఈ వారంలో ప్రక్రియ పూర్తి
పాఠశాలలు 715
విద్యార్థులు 41,404
ఎస్‌ఏలు 1,640
సర్దుబాటు 44
ఎస్‌జీటీలు 1,105
సర్దుబాటు 60-70
నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ వారం రోజుల్లో పూర్తికానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. వారినుంచి ఆదేశాల రాగానే సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేస్తాం. నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నాం.
–సత్యనారాయణ, డీఈఓ