
పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
యాదగిరిగుట్ట: పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పెన్షనర్ల సంఘం వార్షికోత్సవం సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎన్నో ఏళ్లు సేవలందించడం, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో తోడ్పాటునదించడం అభినందనీయమన్నారు. ఎన్‌జీఓల ఇస్తున్న మాదిరిగా పెన్షనర్లకు కూడా హెల్త్‌కార్డులు ఇప్పిస్తానని, ప్రభుత్వనుంచి అన్ని రకాల బెన్‌ఫిట్స్ వచ్చేలా చూస్తానన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి ఆలయ రిటైర్డ్ ఉద్యోగులతోపాటు అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తానన్నారు. ఎమ్మెల్యేగా తన గెలుపులో భాగస్వాములైన పెన్షనర్లు, ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు. పెన్షనర్లు వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా సమావేశాలు నిర్వహించుకునేందుకు యాదగిరిగుట్ట పట్టణంలో ప్రత్యేకంగా భవనాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన ర్లతో పాటు దేవస్థానం ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్‌శర్మ, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి కొక్కొండ యాదగిరి, ఉపాధ్యక్షులు కలకుంట్ల బాల్‌నర్సయ్య, హనుమంతరావు, రాష్ట్ర దేవాలయాల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రిటైర్డ్ ఏఈఓ వేముల రాంమోహన్, రిటైర్డ్ ప్రధానార్చకులు కారంపూడి నరసింహచార్యులు, రంగాచార్యులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య