నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే లైసెన్స్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే లైసెన్స్‌ రద్దు

Jul 13 2025 4:27 AM | Updated on Jul 13 2025 4:27 AM

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే లైసెన్స్‌ రద్దు

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే లైసెన్స్‌ రద్దు

నల్లగొండ: నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసేలా భవిష్యత్‌లో చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దండంపల్లి వద్ద రూ.8 కోట్లతో నిర్మించనున్న ఆటోమెటిక్‌ వెహికిల్‌ టెస్టింగ్‌ సెంటర్‌(ఏటీసీ) భవన నిర్మాణానికి శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. వాహనాల వెనుక రిఫ్లెక్టర్‌ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునేలా జీఓ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేలా ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, వాహనాలకు ఫిట్‌నెస్‌ లేకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకు ఆటోమెటిక్‌ వెహికిల్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ ఉపయోగపడుతుందన్నారు. రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 17ఆటోమెటిక్‌ వెహికిల్‌ టెస్టింగ్‌ స్టేషన్లను ఒక్కో దానిని రూ.8 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా శాఖ ద్వారా స్క్రాపింగ్‌ పాలసీ తీసుకొచ్చామని, ఏటీసీ వల్ల ప్రతి వాహనం వాహన సారథి పరిధిలోకి వచ్చేలా తెలంగాణ వాహన సారథిలో భాగస్వామ్యం చేశామన్నారు. ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌పై క్యాంపుల నిర్వహణ, పాఠశాల విద్యార్థులకు క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్టులు ఆటోమెటిక్‌గా నిర్వహించి ఆ టెస్టులో పాసైతేనే లైసెన్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఫ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ

మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఫ దండంపల్లిలో ఆటోమెటిక్‌ వెహికిల్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి

శంకుస్థాపన

20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల గడిచిన 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాకు 70 ఎలక్ట్రికల్‌ బస్సులు వేయగా.. నార్కట్‌పల్లికి 10 బస్సులు, మిగతావి ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నట్లు తెలిపారు. నార్కట్‌పల్లికి 80 కొత్త బస్సులు కావాలని అదేవిధంగా నూతన డిపో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ శ్రీవాణి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement