
నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలి
భువనగిరి : నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలతోపాటు గర్భిణులకు అబార్షన్లు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులను అరెస్టు చేసి వెంటనే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భువనగిరిలోని రైతు బజార్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్లు, అబార్షన్లు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారికిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీమున్సిపల్ చైర్మన్ అంజనేయులు, పార్టీ పట్టణకమిటి అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, రమేష్, సందెల సుధాకర్, కుశంగుల రాజు, ఇట్టబోయిన గోపాల్, భిక్షపతి, భగత్, చౌదరి, పాండు, ముజీబ్, పద్మ, పావని, మధు తదితరులు పాల్గొన్నారు.