
మూసీపై అన్నదాతల ఆశలు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కాలువల కింద ఇప్పటికే వరినార్లు పోసుకున్న రైతులు మరో పది రోజుల్లో నాట్లకు సమాయత్తమవుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని మూసీ ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగుకు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు మూసీ ప్రధాన కాల్వల ఆధుణీకరణ పనులు పూర్తికాలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయలేదు. దీంతో మూసీ ఆయకట్టులో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో అయోమయం నెలకొంది.
35వేల ఎకరాల ఆయకట్టు..
మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 645 అడుగులు(4.46 టీఎంసీలు). ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు 35వేల ఎకరాల్లో పంటలు సాగువుతుంది. ప్రధాన కాల్వలకు మోటార్లు వేయడం ద్వారా అనధికారంగా మరో 15వేల ఎకరాలు సాగవుతుంది. యాసంగి పంట సాగు కోసం ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీ వరకు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదల ముగిసే నాటికి రిజర్వాయర్‌లో నీటిమట్టం 622 అడుగుల కనిష్ఠ స్థాయికి తగ్గింది. అప్పటి నుంచి వేసవిలో అకాల వర్షాలు, వానాకాలం ప్రారంభంలో తొలకరి వర్షాలతో మూసీ ఎగువ ప్రాంతాలైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వాగుల ద్వారా వరద నీరు మూసీ ప్రాజెక్టుకు వచ్చి చేరింది. అప్పటి నుంచి నిరవధికంగా వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రస్తుతం నీటిమట్టం 641.65(3.60 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. వానాకాలం ప్రారంభంలోనే మూసీ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆయకట్టు రైతుల్లో వానాకాలం పంట సాగుపై ఆశలు చిగురించాయి.
కొనసాగుతున్న కాల్వ కట్ట మరమ్మతు పనులు..
మూసీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వకు నీటి విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ వద్ద కాల్వకు ఇరువైపులా లైనింగ్ దెబ్బతింది. దీంతో కాల్వకు నీటి విడుదల చేసిన సమయంలో నీటి ప్రవాహం ధాటికి ఇరువైపులా మట్టి కట్టలు కోతకు గురయ్యాయి. కోతకు గురైన చోట కాల్వకు ఆధుణీకరణ పనులను కాంట్రాక్టర్ ఇరవై రోజుల క్రితమే ప్రారంభించారు. ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం పనులు సాగితే పూర్తికావడానికి మరో వారం రోజుల సమయం పట్టవచ్చు. ఈ పనులు పూర్తయితేనే కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది.
సాగుకు సిద్ధమవుతున్న రైతులు..
వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందుగానే మూసీ ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఈసారి సాగుకు ఎలాగైనా నీరు వస్తుందనే ఉద్దేశంతో రైతులు బోర్లు, బావుల కింద వరినార్లు పోసుకున్నారు. రైతులు మెట్ట దుక్కులు దున్ని వరినాట్లకు పొలాలను సిద్ధ చేశారు. మొదటి విడతలో కాల్వలకు విడుదల చేసిన నీటితోనే దమ్ములు చేసి నాటు వేసేందుకు వీలుగా పొలాలను సిద్ధ చేశారు. కానీ నీటి విడుదలపై అధికారులు ఇంత వరకు షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఎప్పుడు ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రెండు నెలలు వర్షాలు కురిసే అవకాశమున్నందున రిజర్వాయర్‌లో అందుబాటులో ఉన్న నీటిని ముందస్తుగానే సాగుకు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
ఫ 641.65 అడుగులకు చేరిన
ప్రాజెక్టు నీటిమట్టం
ఫ గరిష్ఠ నీటి మట్టానికి మరో మూడు అడుగుల దూరంలో..
ఫ ఆయకట్టుకు నీటి విడుదల
చేయాలని రైతుల విన్నపం

మూసీపై అన్నదాతల ఆశలు