
చిన్నారి హర్షిత మృతదేహం లభ్యం
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో శనివారం కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడగా.. ఆదివారం చిన్నారి మృతదేహం లభ్యమైంది. వివరాలు.. వంగమర్తి గ్రామానికి చెందిన వాణి(23)కి రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన సింగారపు మహేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. నెల రోజుల క్రితం చిన్న కుమార్తె హర్షిత(8 నెలలు)తో కలిసి వాణి వంగమర్తిలోని తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది. మానసికస్థితి సరిగా లేని వాణి శనివారం చిన్నారి కుమార్తె హర్షితతో కలిసి గ్రామ సమీపంలోని నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం సాయంత్రం వాణి మృతదేహం లభ్యం కాగా.. ఆదివారం చిన్నారి హర్షిత మృతదేహం బావిలో తేలియాడుతూ కనిపించింది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో ఆదివారం సాయంత్రం వాణి, చిన్నారి హర్షిత అంత్యక్రియలు జరిగాయి.
తల్లి, కుమార్తె అంత్యక్రియలు పూర్తి