
వినతులు స్వీకరించి.. మొర ఆలకించి
భువనగిరిటౌన్ : సమస్యల పరిష్కార వేదిక ప్రజా వాణికి సోమవారం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. మొత్తం 86 అర్జీలు రాగా అత్యధికంగా భూసమస్యలకు సంబంధించి 54 మంది దరఖాస్తులు ఇచ్చారు. పంచాయతీరాజ్ 8, వ్యవసాయ 4, ఇరిగేషన్ 3, సంక్షేమం 3, హౌసింగ్ 2, కో పరేటివ్ 2, విద్య 2, గ్రామీణాభివద్ధి 2, ఎస్సీ కార్పొరేషన్ 2, ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, పోలీసు శాఖకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వీరారెడ్డి వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినతులు స్వీకరించిన వారిలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీ నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
వినతుల్లో కొన్ని..
● తనకు 2.01 ఎకరాల భూమి ఉండగా 39 గుంటలు కాళేశ్వరం కాలువలో పోయిందని, ఇంకా 42 గుంటలకు రికార్డుల్లో రెండు గుంటలే చూపుతుందని రామన్నపేట మండలం పాశబోయిన జయలక్ష్మి ఫిర్యాదు చేశారు. మిగతా 39 గంటుల భూమిని కూడా ఆన్‌లైన్ ద్వారా తన పేరున నమోదు చేయాలని విన్నవించారు.
● ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీ కార్యదర్శిపై బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన చెందిన కందుల శ్రీనివాస్‌రావు ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణ సమయంలో నంబర్లు కేటాయించాల్సి ఉండగా ఖాళీ స్థలాకు ఇస్తున్నారని , ఇందుకోసం చేతి వాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
● నాతాళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249లో పల్లెప్రకృతి వనానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారని గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు.
విచారణ చేయించాలి
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో వార్డు కమిటీ సభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నాయని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కమిటీల్లో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇళ్లు మంజూరు చేయిస్తామని రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిందన్నారు. అర్హులను కాదని కాంగ్రెస్ కార్యకర్తలకు, తమ అనుయాయులకు ఇళ్లు మంజూరు చేస్తున్నారని, విచారణ చేపట్టాలని కోరారు.
ఫ ప్రజావాణిలో అర్జీలు వెల్లువ
ఫ అధికంగా భూ సమస్యలపైనే..
ఫ వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు

వినతులు స్వీకరించి.. మొర ఆలకించి