
తవ్వింది చెరువంతా!
అనుమతి కొంత..
ఫిర్యాదు చేస్తేనే
స్పందిస్తున్న యంత్రాంగం
గుట్టలు, చెరువులు, ప్రభుత్వ భూములు, రైతుల పట్టాభూముల నుంచి మట్టి అక్రమ దందా నడుస్తున్న విషయం బహిరంగ రహస్యమే అయినా సంబంధిత శాఖలు చోద్యం చూస్తున్నాయి. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోవడం లేదని, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు కూడా కారణమని తెలుస్తోంది. చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి మూడు రోజుల పాటు రేయింభవళ్లు 60 టిప్పర్ల ద్వారా మట్టి తరలించినా చోద్యం చూడటం అధికారుల తీరును ప్రశ్నిస్తోంది. 100 కాల్ ద్వారా సమాచారం అందితే తప్ప.. స్పందించలేదు.
సాక్షి,యాదాద్రి: మట్టి మాఫియాకు అడ్డులేకుండాపోతుంది. ప్రకృతి సంపదను విచ్చలవిడిగా కొల్ల గొడుతూ కోట్ల రూపాయలు వెనుకేసుకుంటోంది. చెరువులు, వాగులు, వంకలు, గుట్టలు.. ఇలా దేన్నీ వదలడం లేదు. అడ్డుకోవాల్సిన యంత్రాంగం నెలవారీ మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల రా జాపేట మండలం చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా మూడు రోజుల్లోనే కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని తరలించడం అక్రమదందాకు నిదర్శనం.
రూ.6 లక్షలకు ఒప్పందం
మల్పవోని చెరువు శిఖం భూముల పట్టా దళితుల పేరున ఉంది. గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నేత దళితులకు, మట్టి వ్యాపారులకు మధ్యవర్తిగా వ్యవహరించాడని, మట్టి తరలించేందుకు రూ.6 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. గత నెల 21,22,23 తేదీల్లో మూడు రోజుల పాటు చెరువులో హిటాచీలు పెట్టి సుమారు 60 టిప్పర్ల ద్వారా నిరంతరాయం మట్టిని తరలించారు. బొమ్మలరామారం, చీకటి మామిడి తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు మట్టిని చేరవేశారు. మట్టి అక్రమ రవాణా విషయాన్ని 24వ తేదీ రాత్రి 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మల్ప వోని చెరువు వద్దకు చేరుకుని దాడులు నిర్వహించారు. మట్టి తరలిస్తున్న 23 టిప్పర్లు, హిటాచీలను పట్టుకున్నారు. అయితే హిటాచీలను అదే రాత్రి వదిలేశారని పోలీసులపై ఆరోపణలున్నాయి. టిప్పర్లకు మాత్రం జరిమానా విధించడంతో పాటు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.
చర్చనీయాంశంగా నేతల ఫోన్ సంభాషణ
చల్లూరులోని మల్పవోని చెరువు మట్టి తరలింపునకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య సుధీర్ఘ ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పరిధి దాటి తవ్వకాలు..
వ్యవసాయ భూములు సారవంతం చేయాలని రైతుల పేరున అనుమతి పొందుతున్నారు. కొంత విస్తీర్ణం మేరకు అనుమతి పొంది చెరువుంతా తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని పొలాలకు కాకుండా ఇటుక బట్టీలు, వెంచర్లు, ఇతర వాణిజ్య అవసరాల నిమిత్తం తరలిస్తున్నారు. ఒక టిప్పర్ మట్టిని రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముతున్నారు. ఇటుక బట్టీల్లో ఇటుకల తయారీకి నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతులు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం ఆయా శాఖలు నిర్దేశించిన ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు జరపాలి. ఇందుకు గాను క్యూబిక్ మీటర్‌కు రూ.20 చొప్పున రాయల్టీ, ఇతర పన్నులను ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతూ చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూములు ధ్వంసం చేస్తున్నారు.
చల్లూరులోని మల్పవోని చెరువులో విచ్చలవిడి తవ్వకాలు
ఫ మూడు రోజుల్లోనే
రూ.కోట్లు విలువ చేసే మట్టి తరలింపు
ఫ సాగుభూముల సారవంతం పేరున అనుమతి
ఫ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు
ఫ ఇటుక బట్టీలకు ట్రిప్పు రూ.6 వేల నుంచి రూ.10వేలకు అమ్మకం
ఫ మిగతా మండలాల్లోనూ
తరలిపోతున్న ప్రకృతి సంపద
ఫ కళ్లెదుటే జరుగుతున్నా
పట్టించుకోని యంత్రాంగం
అనుమతి తప్పనిసరి
మట్టి తరలించాలంటే సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరి. పర్మిషన్ తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయి. చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి మట్టి తరలించిన వారిపై కేసులు నమోదు చేశాం. 24 టిప్పర్లకు జరిమానా విధించాం. టిప్పర్లలో మట్టి తవ్విపోసిన హిటాచీలతో పాటు వాటి డ్రైవర్లను గుర్తించి కేసులు నమోదుచేస్తాం. –కృష్ణారెడ్డి, ఆర్డీఓ

తవ్వింది చెరువంతా!