
పరిశ్రమల్లో భద్రత ఎంత?
సాక్షి, యాదాద్రి, చౌటుప్పల్ రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించి పంద మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటన వల్ల గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని రసాయన పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 50కి.మీ. దూరానికి తరలించాలనే నిర్ణయించింది. దీంతో వందల సంఖ్యలో పరిశ్రమలు జిల్లాలోని పలు మండలాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో భద్రత చర్యలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. జిల్లాలోని ఉన్న పేలుడు, ఫార్మా కంపెనీల్లో తరుచూ ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సోమవారం పాశమైలారంలో జరిగిన ప్రమాదంతో అక్కడ వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులు భయం భయంగా విధులకు వెళ్తున్నారు.
ఫార్మా కంపెనీలకు అడ్డాగా..
జిల్లాలోని భువనగిరి పారిశ్రామిక వాడ, రాయిగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లోని నెమరగోముల, కొండమడుగు, బీబీనగర్, యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరు, మోటకొండూరు మండలం కాటేపల్లి, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, దండుమల్కాపురం, దేవలమ్మ నాగారం, ఎల్లంభావి, తంగడపల్లి, చౌటుప్పల్, ధర్మోజిగూడెం, లింగోజిగూడెం, ఆరెగూడెం, పంతంగి, ఎస్,లింగోటం మందోళ్లగూడెం, చిన్న కొండూరు, జైకేసారం, పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, ఆలేరు మండలం టంగుటూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పేలుడు పదార్థాల తయారీ, ఫార్మా కంపెనీలు ఉన్నాయి.
భద్రతా ప్రమాణాలు గాలికి..
పరిశ్రమలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. రియాక్టర్‌లు, బ్రాయిలర్‌లు పేలి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రియాక్టర్‌లు పేలినప్పుడు రసాయనాలు శరీరంపై పడి కాలిపోయి, పొగతో ఊపిరాడక చనిపోతారు. రియాక్టర్ల వద్ద పనిచేసే కార్మికులు ఆక్సిజన్ ఫైర్ కోట్లు ధరించాలి. ఫోం అందుబాటులో ఉండాలి. కాలం చెల్లిన రియాక్టర్లతో కంపెనీల యాజమాన్యాలు, నైపుణ్యంలేని కార్మికులతో పనులు చేయిస్తున్నారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరగుతున్నాయి.
ఫ ఫార్మా, పేలుడు పదార్థాల తయారీ
కంపెనీల్లో తరచూ ప్రమాదాలు
ఫ గాల్లో దీపంలా కార్మికు ప్రాణాలు
ఫ కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ఫ పాశమైలారం ఘటనతో జిల్లాలోని కార్మికుల్లో తీవ్ర భయాందోళన
తనిఖీల ఊసేలేదు !
వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశ్రమల ఇన్‌స్పెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్,భూగర్భ గనుల శాఖ,కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేయాలి. కానీ ఈ అధికారులు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. కనీసం కార్యాలయాల చిరునామా సైతం తెలియని దుస్థితి నెలకొంది. దీంతో పరిశ్రమల నిర్వహణలో యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శించడం, భద్రతా చర్యలు పాటించకపోవడం, కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం వంటి వాటితో కార్మికులు ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు కార్మికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.