విద్యుదాఘాతంతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Jul 3 2025 7:41 AM | Updated on Jul 3 2025 7:41 AM

విద్యుదాఘాతంతో  యువకుడి మృతి

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

కోదాడరూరల్‌: వాకింగ్‌కు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని ఉత్తమ్‌పద్మావతినగర్‌ కాలనీలో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డు వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని ఎంఎస్‌ కళాశాల వెనుక నివాసముంటున్న షేక్‌ సల్మాన్‌(23) స్థానికంగా బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం అతడు హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి వెంట వాకింగ్‌ చేసుకుంటూ కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్‌ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉత్తమ్‌పద్మావతినగర్‌ కాలనీ వద్దకు రాగానే అతడు కాలు జారి హైవే సర్వీస్‌ రోడ్డుపై ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జానిమియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ పోలీసులు తెలిపారు.

కల్మలచెరువులో..

గరిడేపల్లి: గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మలచెరువు గ్రామానికి చెందిన గుండెబోయిన అచ్చమ్మ(60) తన కుమారుడు వీరయ్య వద్ద ఉంటోంది. కుమారుడు, కోడలు పనికి వెళ్తే వారి పిల్లల ఆలనాపాలన చూసుకుంటుంది. అచ్చమ్మ కుమారుడి ఇంటికి వచ్చే సర్వీస్‌ వైరు ఇంటి ముందు ఉన్న ఇనుప కడ్డీలను తాకుతుండగా.. బుధవారం ఆమె అది గమనించకుండా ఇనుప కడ్డీలను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

చిట్యాల: విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో జరిగింది. చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన జింటు దత్తు(31) చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోని హిండస్‌ పరిశ్రమలో సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం అతడు వెలిమినేడు గ్రామ శివారులోని మద్రాస్‌ ఫిల్టర్‌ కాఫీ షాపు వద్ద నుంచి విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి వెంట నడుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో నార్కట్‌పల్లి వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి దత్తును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement