
జాబ్ క్యాలెండర్ ద్వారా లైబ్రేరియన్ పోస్టుల భర్తీ
భూదాన్‌పోచంపల్లి: రాబోయే జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లైబ్రరియన్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎండీ రియాజ్ అన్నారు. బుధవారం పోచంపల్లిలోని శాఖా గ్రంథాలయాన్ని ఆయన సందర్శించి అక్కడ వసతులు, పుస్తకాలను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో 600 గ్రంథాలయాలు ఉన్నాయని, వన్‌మ్యాన్ కమిషన్ వేసి రాష్ట్రంలో 750 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 80వేల పుస్తకాలు చదివానన్న కేసీఆర్ గత పదేళ్లలో గ్రంథాలయాలకు 8 పుస్తకాలు కూడా కొనివ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రాజారామ్మోహన్‌రాయ్ ఫౌండేషన్ ద్వారా వచ్చే నిధులన్నింటినీ గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు వినియోగిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో గ్రంథాలయాలను పటిష్టం చేస్తామన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సెస్ వసూల్ చేస్తున్నా, గ్రంఽథాలయాలకు చెల్లించడంలేదని అన్నారు. దీనిపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. భూదాన్‌పోచంపల్లి గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పోచంపల్లికి వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారని.. వారికి ఈ ప్రాంతం గొప్పతనం తెలియజెప్పేందుకు గ్రంథాలయం ఒక వేదిక కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సుధీర్, నాయకులు తడక వెంకటేశం, కొట్టం కరుణాకర్‌రెడ్డి, తడక యాదగిరి, రాపోలు జ్ఞానేశ్వర్, మక్తాల నర్సింహ, చింతకుంట్ల కృష్ణారెడ్డి, జయసూర్య, ఆకుల శోభ, సుచిత్ర పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్
ఎండీ రియాజ్