
మిరప సాగుకు అనువైన సమయం ఇదే..
అంతర పంటలు
పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ, మిరప చేను చుట్టూ రక్షణ పంటలుగా హైబ్రిడ్ జొన్న లేదా మొక్కజొన్నను రెండు లేదా మూడు సాళ్లలో వేయాలి. కీటక ఆకర్షణ(ఎర) పంటలుగా బంతి, ఆముదాన్ని పొలంలో అక్కడక్కడా వేయాలి.
పెద్దవూర: తొలకరి వర్షాలు పడుతుండగా మిరప పంట సాగు చేసుకునేందుకు అనువైన సమయమని ఉద్యానవన శాఖ అధికారి మురళి వివరించారు. మిరప పంటలో యాజమాన్య పద్ధతుల గురించి ఆయన మాటల్లోనే..
అనువైన నేలలు
మిరప సాగుకు ఉదజని సూచిక(పీహెచ్) 6 నుంచి 6.5 ఉన్న నేలలు అనుకూలం. వర్షాధారపు పంటకు నల్ల రేగడి నేలలు, నీటి ఆధారపు పంటకు నల్ల, ఎర్ర, చల్క నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, అనుకూలం.
వాతావరణం, విత్తే సమయం
మిరప పంట అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. అయితే మిరపకు 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరపను వానాకాలం సీజన్‌లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరపను సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా మిరప పంటను ఖరీఫ్ సీజన్‌లో జూలై, ఆగస్టు నెలల్లోనూ, యాసంగిలో అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో సాగు చేసుకోవచ్చు.
నేల తయారీ
పొలాన్ని వేసవిలో లోతుగా దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల వేప పిండి, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేయాలి. అలాగే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2కిలోల ట్రైకోడెర్మావిరిడి శిలీంధ్రపు పొడిని కలిపి 10–15 రోజులు నీడలో ఉంచి శిలీంధ్రం వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేస్తే తొలి దశలో మొక్కలను ఆశించే తెగుళ్ల నుంచి కాపాడవచ్చు. పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకుని భూమిలో కలియ దున్నాలి. దీని వలన భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10–15 రోజుల తర్వాత కల్టివేటర్‌తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 1–3 సార్లు దున్నుకోవాలి.
విత్తనశుద్ధి
విత్తనశుద్ధి ద్వారా విత్తనం నుంచి వ్యాపించే చీడపీడల నుంచి పంటను రక్షించవచ్చు. మిరప విత్తనాలను మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 150గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్పేట్‌ను ఒక లీటరు నీటిలో కరిగించి 15 నుంచి 20 నిమిషాల పాటు విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీటిని తీసివేసి మంచి నీటితో శుభ్రంగా కడిగి విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు గాను కిలో విత్తనానికి 8గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ను విత్తనాలకు పట్టించాలి. దీని వలన విత్తిన 20–25 రోజుల వరకు రసం పీల్చు పురుగుల ఉధృతి నివారణ జరుగుతుంది. బ్యాక్టీరియా, బూజు తెగుళ్ల నివారణకు గాను కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్ లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకోవాలి. చివరిగా అదే విత్తనాన్ని ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రం పొడిని 5–10 గ్రాముల విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి.
విత్తన మోతాదు
మిరపను రెండు పద్ధతుల్లో సాగు చేయవచ్చు. మిరప విత్తనాలను నేరుగా విత్తడానికి అయితే ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంచుటకు విత్తన మోతాదు సూటి రకాలకు 650గ్రా., హైబ్రిడ్ రకాలైతే 75 నుంచి 100గ్రా. విత్తనం సరిపోతుంది.
నారు పెంచే విధానం
మిరప నారును రెండు పద్ధతుల్లో పెంచవచ్చు. మిరప నారు పెంచేందుకు సారవంతమైన ఒండ్రునేలలు, నీటి వసతి, ఒక మోస్తారు నీడ కలిగిన ప్రదేశాలు చాలా అనుకూలం. ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుగల మడిలో ఒక ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచుకోవచ్చు. నారు పెంచటానికి నేలకు కొంచెం ఎత్తులో మట్టిని బెడ్డుగా చేసుకోవాలి. నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమళ్లలో విత్తనాలను 5 నుంచి 8 సెం.మీ. మధ్య దూరం, 1.5 సెం.మీ. లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన 9వ రోజు, 13వ రోజున లీటర్ నీటిలో 3 గ్రా. కాఫర్ ఆక్సీక్లోరైడ్‌ను కలిపిన ద్రావణంలో నారుమళ్లను తడపాలి.
ప్రోట్రేలలో నారును పెంచే విధానం
ఈ పద్ధతిలో ప్రతి విత్తనం సమానంగా, ఆరోగ్యంగా పెరిగి పంట ఒకేసారి కాపునకు వస్తుంది. నారు ధృడంగా పెరగడంతో పాటు నారుకుళ్లు, వైరస్ తెగుళ్లను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎకరా పొలంలో నాటుటకు 98 సెల్స్ కలిగిన 120 ట్రేలు సరిపోతాయి. ఒక్కో ప్రోట్రేను నింపుటకు సుమారు 1.2 కిలోల కోకోపిట్ మిశ్రమం అవసరం. ఒక్కొక్క సెల్‌లో ఒక్క విత్తనం నాటుకుని తిరిగి కోకోపిట్‌తో కప్పుకోవాలి. 6రోజుల తర్వాత మొక్క మొలకెత్తడం ప్రారంభమయ్యాక వీటిని ఎత్తైన బెడ్లలోకి మార్చుకోవాలి.
మొక్కలను నాటుకునే విధానం
మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు 24శ్రీ24 లేదా 26శ్రీ26 లేదా 28శ్రీ28 అంగుళాల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటుకోవాలి. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాల్లో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా నాటుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నాటుకునేటప్పడు మొక్కల మధ్య దూరం 30–45 అంగుళాలు ఉండాలి.
ఫ ఉద్యానవన శాఖ అధికారి మురళి సూచనలు
కలుపు యాజమాన్యం
కలుపు నివారణకు మొక్కలు నాటిన 20–25 రోజుల తర్వాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15–20 రోజులకు ఒక్కసారి దున్నాలి. ఇలా మొక్క నేల మోత్తాన్ని కప్పివేసే వరకు 4–5 సార్లు దున్నాలి. మొక్కలను నాటుకునే 1–2 రోజుల ముందు లీటర్ నీటిలో 1.5మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత ఎకరానికి 400–500 మిల్లీలీటర్ల కై ్వజాలోఫాస్ ఇథైల్‌ను మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి.