
బంగారంపై లోన్ ఇచ్చారు.. నకిలీదంటున్నారు!
మోతె: తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు నుంచి విడిపించుకున్న తర్వాత అది నకిలీదని బ్యాంకు వారు చెప్పడంతో బాధితుడు (ఖాతాదారుడు) ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ ఘటన సోమవారం మోతె ఎస్‌బీఐలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మోతె మండల కేంద్రానికి చెందిన జిల్లపెల్లి పరశురాములు 2023 మార్చిలో తన అవసరం నిమిత్తం 18 గ్రాముల బంగారు గొలుసును స్థానిక ఎస్‌బీఐలో కుదువపెట్టి లోన్ తీసుకున్నాడు. రెండేళ్లపాటు తాను తీసుకున్న లోను బాపతు ఏటా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఖాతాదారుడిని బ్యాంకు వారు పిలిచి అసలు, వడ్డీ చెల్లించి బంగారం విడిపించుకోవాలని సూచించారు. బాధితుడు సోమవారం బ్యాంకులో అసలు వడ్డీతో సహా చెల్లించాడు. బ్యాంకు మేనేజర్ బాధితుడికి బంగారం ఇస్తూ ఇది నకిలీ బంగారమని తెలిపారు. మీరు బ్యాంకులో తాకట్టుపెట్టిన కొన్ని నెలల తర్వాత ఆడిట్ వారు మీ బంగారాన్ని చెక్ చేయగా నకిలీ బంగారమని నిర్ధారించారని మేనేజర్ తెలిపారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన సమయంలో చెక్ చేసి లోన్ ఇచ్చారని, ఇప్పుడు నకిలీ బంగారం ఎలా అవుతుందని బాధితుడు ప్రశ్నించాడు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు. నాకు ఈ బంగారం వద్దు నా ఒరిజనల్ బంగారం నాకు ఇవ్వండి అని బ్యాంకు వారి వద్దనే వదిలి వచ్చానని సదరు బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ.. బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తన బంగారం తనకు
ఇవ్వాలంటున్న బాధితుడు
బ్యాంకు అధికారులతో వాగ్వాదం
మోతె ఎస్‌బీఐలో ఘటన