ఆశ చూపి.. సొమ్ము కాజేసి!
అధిక వడ్డీ ఇస్తామని రూ.కోట్లలో వసూలు
సాక్షి, యాదాద్రి: వలిగొండ మండలం గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కిరాణ షాపుల యజమానులు వడ్డీలకు నడుపుతుంటారు. ఇదే క్రమంలో తమ వద్ద డబ్బులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని గ్రామస్తులకు ఆశ చూపారు. వారి మాటలు నమ్మి 80 మంది రూ.1.50 కోట్లు ఇచ్చారు. వ్యాపారులు తిరిగి చెల్లించకుండా గ్రామం నుంచి ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. బాధితులు డబ్బుల కోసం నేటికీ పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటువంటి ఘటనలతో అమాయక ప్రజలు రూ.లక్షల్లో మోసపోతున్నారు.
తమ దగ్గర తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు చూపుతామంటూ, అధిక వడ్డీ ఇస్తామంటూ బంగారం దుకాణాలు, ఫైనాన్స్, చిట్‌ఫండ్ కంపెనీలు, వడ్డీ వ్యాపారులు అక్రమ దందా చేస్తున్నారు. వందకు 10 రూపాయల వరకు వడ్డీ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. కొంతకాలం నెలనెలా వడ్డీ ఇవ్వడంతో వారి మాటలు నమ్మి అమాయక ప్రజలు అప్పుఇవ్వడం, పెట్టుబడులు పెడుతున్నారు. కోట్ల రూపాయలు వసూలైన తరువాత వ్యాపారులు పత్తాలేకుండా పోతున్నారు. కొందరు ఐపీ పెట్టి అప్పులిచ్చిన వారి నోరు మూయిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో 16 చీటింగ్ కేసులు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. వెలుగులోకి రానివి మరికొన్ని ఉన్నాయి. కేసులు పెడితే తమ పైసలు రావన్న ఉద్దేశంతో వీలైనంత వరకు రాజీమార్గంలో రాబట్టుకునేందుకు బాధితులు పెద్ద మనుషులు, మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు.
కొన్ని ఘటనలు
● యాదగిరిగుట్టలో జైభవానీ జ్యువెలర్స్ పేరుతో ఇద్దరు వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు. ప్రజల నుంచి బంగారం, వెండి తాకట్టు పెట్టుకుని కొంతకాలం తరువాత బోర్డు తిప్పేశారు. జనవరిలో ఈ ఘటన వెలుగుచూడగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. నమోదు అయ్యింది. జితేందర్ అనే పాన్ బ్రోకర్ వద్ద బంగారం, వెండి కుదువపెట్టినట్లు పోలీలీసులు గుర్తించారు. డబ్బుల కోసం బాధితులు తిరుగుతూనే ఉన్నారు.
● ఆలేరులో ఓ బైక్ కంపెనీ షోరూం నిర్వాహకుడు, అతని భార్య వందకు రూ.5నుంచి రూ.10 వరకు వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేశారు. కొంతకాలం తరువాత పత్తా లేకుండా పారిపోయారు. అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు.
● ఆలేరు పట్టణంలో మెడికల్ షాప్ నిర్వాహకుడు వడ్డీ నిమిత్తం కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఐపీ పెట్టాడు. ఇచ్చిన డబ్బులు రాబట్టుకునేందుకు బాధితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
● జనగామకు చెందిన మేడారం సురేష్ మోత్కూరులో 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. అక్కడే ఇల్లు నిర్మించుకున్నాడు. మారుతీ పెయింటర్ పేరుతో షాప్ నిర్వహిస్తూ రూ.3కోట్ల వరకు అప్పులు చేశాడు. తిరిగి చెల్లించలేక ఆరు నెలల క్రితం దుకాణం సర్దుకుని పరారయ్యాడు.
● ఖమ్మం జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి మోత్కూరులో ఆస్పత్రి ఏర్పాటు చేశాడు. రూ.5 లక్షల వరకు అప్పులు చేసి రాత్రికిరాత్రే గ్రామం నుంచి ఉడాయించాడు.
● మోత్కూరు మండలం పాటిమట్లకు చెందిన గోపాల్ బస్ కండక్టర్. అతని భార్య చిరుదుకాణం నిర్వహించేది. అందినకాడల్లా సుమారు రూ.50 లక్షలకు పైగా అప్పులు చేశారు. తిరిగి చెల్లించలేక పారిపోయారు.
ఫ కొంతకాలం తరువాత బోర్డు తిప్పేస్తున్న ఘనులు
ఫ బాధితులు ఒత్తిడి తేకుండా ఐపీ
ఫ రూ.కోట్లలో నష్టపోతున్న జనం
ఫ ఏడాదిన్నర కాలంలో జిల్లాలో 22 చీటింగ్ కేసులు


