వైభవంగా సుదర్శన నారసింహ హోమం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఉదయం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు వైభవంగా జరిపించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): రోడ్డు దాటుతున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ పరిధిలోని దండు మైసమ్మ ఆలయం వద్ద గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం తేలువారిగూడేనికి చెందిన గట్టిగొర్ల మహేష్, శ్రావణి దంపతులు వారి కుమారుడు మోక్షిత్(4)తో కలిసి గురువారం ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ పరిధిలోని దండు మైసమ్మ ఆలయ సన్నిధిలో తమ బంధువుల శుభకార్యానికి వచ్చారు.
ఆలయం వద్ద మోక్షిత్ రోడ్డు దాటుతుండగా.. సూర్యాపేట నుంచి నెమ్మికల్లుకు వస్తున్న ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోక్షిత్‌ను సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి. శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు.


