వంటలో నాణ్యత.. పరిసరాల పరిశుభ్రత
ఫ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి
ఫ రుచికరమైన వంట తయారీ,
స్కూళ్ల పరిశుభ్రతపై కార్యాచరణ
ఫ ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో కార్మికులకు శిక్షణ పూర్తి
నాణ్యమైన భోజనం
అందించేందుకే శిక్షణ
పాఠశాలల్లో వంట చేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ ఇవ్వబడింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన, పోషణ విలువతో కూడిన భోజనం అందించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచనున్నారు.
– సత్యనారాయణ, డీఈఓ
భువనగిరి : జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం, వారు ఉండే పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం కేజీబీవీ, మోడల్ పాఠశాలల్లో వంట చేసే ఇద్దరు మహిళలు, ఒక ఎస్‌ఓ, ఇద్దరు స్వీపర్లు (స్కావెంజర్లు), ఒక ఏఎన్‌ఎం చొప్పున ఎంపిక చేసి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈనెల 9న పారిశుద్ధ్య, వంట కార్మికులతోపాటు 50 కాంప్లెక్స్‌లకు హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు.
పాఠశాలలు ఇలా..
జిల్లాలో 738 ఉన్నాయి. వీటిలో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత, 11 కేజీబీవీ, 7 మోడల్ పాఠశాలలున్నాయి. ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో 49,288 మంది విద్యార్థులున్నారు. పాఠశాలల్లో వంట కార్మికులు 1,270 మంది ఉండగా వీరితోపాటు ఒక్కో పాఠశాలల్లో ఒక్కో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. కేజీబీవీలో వంట చేసేందుకు 3 నుంచి 5 వరకు వంట కార్మికులు ఉండగా స్వీపర్లు ఇద్దరు, ఒక ఏఎన్‌ఎంలు ఉంటారు. అలాగే మోడల్ స్కూళ్లలో నలుగురి వరకు వంట కార్మికులు, ఇద్దరు స్వీపర్లు, బాలికల పాఠశాలల్లో అయితే ఒక ఏఎన్‌ఎం సేవలు అందిస్తున్నారు.
మార్పు తెచ్చేలా..
చాలా మంది వంట కార్మికులకు పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం తయారీపై అవగాహన లేదు. దీంతో వారు వండిన ఆహారాన్ని పిల్లలు తినేందుకు ఆసక్తి చూపడంలేదు. పాఠశాలల్లో పరిశుభ్రత లోపించి విద్యార్థులు తరచు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలని విద్యాశాఖ భావించి శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో కార్మికులు కూరగాయల శుభ్రత, రుచికరమైన ఆహారం ఎలా తయారు చేయాలనే అంశాలపై శిక్షణలో నేర్చుకున్నారు.


