యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
నకిరేకల్: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన కొప్పుల శ్రీజ ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాలిగౌరారం మండలం వల్లాల మోడల్ స్కూల్ ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తిచేసిన శ్రీజ గత నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీజ పాల్గొంటుందని తెలిపారు.
రసాయన వ్యర్థాల శాంపిల్స్ సేకరణ
చివ్వెంల(సూర్యాపేట): లారీల్లో రసాయనిక వ్యర్థాలు తీసుకొచ్చి సోమవారం రాత్రి చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన రహదారి పక్కన వదిలిపెట్టారు. మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రోడ్డు పక్కన పారబోసిన రసాయనిక వ్యర్థాల శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వ్యర్థాలు వదిలిన లారీలను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

హనుమంతుడికి ఆకుపూజ