
చెత్త సమస్య.. జనం అవస్థ
యాదగిరిగుట్ట : మున్సిపాలిటీని డంపింగ్ యార్డు సమస్య పట్టి పీడిస్తోంది.పట్టణ శివారులో రెండు ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసినా స్థలం వివాదం కారణంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో రోజూ సేకరిస్తున్న చెత్తను యాదగిరిగుట్ట శివారులోకి తరలించి దహనం చేస్తున్నారు. దుర్వాసన, పొగతో పరిసర ప్రాంత ప్రజలు, దారిన వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు.
రోజూ ఏటు టన్నుల చెత్త వ్యర్థాల ఉత్పత్తి
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 5,003 నివాస గృహాలు, 50కి పైగా హోటళ్లు, 120 వరకు దుకాణాలు ఉన్నాయి. 21వేల జనాభా ఉండగా యాదగిరి క్షేత్రానికి రోజూ ఐదు వేల మంది భక్తులు వస్తుంటారు. రోజుకు ఏడు టన్నుల చెత్త వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. శని, ఆదివారం, సెలవురోజుల్లో మరొక టన్ను వ్యర్థాలు అదనంగా ఉత్పత్తి అవుతాయి. పారిశుద్ధ్య నిర్వహణకు 47 మంది కార్మికులు ఉన్నారు. సేకరించిన చెత్తను 8 ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారా ఏరోజుకారోజు యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వెళ్లే మార్గంలో ఓ చోట డంప్ చేసి కాల్చివేస్తున్నారు.
గోదావరి జలాలు కలుషితం
మల్లాపురం మార్గంలో తరలించిన చెత్తను కాల్చడం ద్వారా పొగ వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పక్కనుంచి వెళ్తున్న కాళేశ్వరం కాలువలోకి చెత్త చేరుతుంది. దీంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి గండిచెరువులోకి వెళ్లే గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
గుట్టలో ప్రారంభానికి నోచని డంపింగ్ యార్డు
ఫ పట్టణ శివారుకు చెత్త తరలింపు, కాల్చివేత
ఫ దుర్వాసన, పొగతో ఇబ్బందులుపడుతున్న స్థానికులు
ఫ కాళేశ్వరం కాలువలోకి చేరుతున్న వ్యర్థాలు
డంపింగ్ యార్డు సమస్యకు కారణాలివీ..
మున్సిపాలిటీలో సేకరించిన చెత్త, వ్యర్థాలను తరలించేందుకు పట్టణ శివారులో రెండు ఎకరాల్లో స్వచ్ఛత పార్క్ పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయడానికి డంపింగ్ యార్డులో కోటి రూపాయల వ్యయంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ యంత్రాలను బిగించింది. ఈ పనులు ఏడాదిన్నర క్రితమే పూర్తయ్యాయి. ముఖ్యంగా పేపర్ అట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పరిశ్రమలకు విక్రయించి అదనపు ఆదాయం సమకూర్చుకోవాలన్నది మున్సిపాలిటీ ప్రధాన ఉద్దేశం. ఇదిలా ఉండగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన స్థలం తమదంటూ ఓ మహిళా కోర్టుకు వెళ్లింది. దీంతో ఏడాది క్రితం ప్రారంభం కావాల్సిన ప్లాంట్ పెండింగ్ పడింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ సేకరించిన చెత్తను ఖాళీ స్థలంలో డంప్ చేసి కాల్చివేస్తున్నారు.
కేసు కోర్టులో ఉంది
మల్లాపురం సమీపంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశాం. చెత్త, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి యంత్రాలను సైతం బిగించాం. డంపింగ్ యార్డు భూమి తమదని ఓ మహిళ కోర్టులో కేసు వేసింది. త్వరలోనే కేసు పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం. ఆ వెంటనే ప్లాంట్‌ను ప్రారంభిస్తాం. పట్టణ శివారులోకి తరించిన చెత్తను కాల్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.
–అజయ్‌కుమార్‌రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, యాదగిరిగుట్ట

చెత్త సమస్య.. జనం అవస్థ

చెత్త సమస్య.. జనం అవస్థ