
ధాన్యం కొనుగోలు పద్ధతులు భేష్
ఆలేరు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు అవలంబిస్తున్న పద్ధతులు భేష్ అని తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారి షణ్ముఖ సుందరం ప్రశంసించారు. మంగళవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన నేతృత్వంలోని ఐదుగురు అధికారుల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వరిఽ సాగు నుంచి దిగుబడి తరువాత, కేంద్రాలకు తరలించి రైతులు పంటను విక్రయించే వరకు జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలింపు, ఓపీఎంఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో రైతుల బ్యాంకుల ఖాతాల్లో డబ్బుల చెల్లింపు విధానాన్ని వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20రోజుల్లో 10633 క్వింటాళ్ల(26వేల బస్తాల) 233మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడంపై తమిళనాడు బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదేవిధంగా తేమ శాతం, తుది నాణ్యత విశ్లేషణ, ధాన్యం మిల్లులకు తరలించిన ట్రక్కుల వివరాలతో కూడిన రిజిస్టర్లు, వాటి నిర్వహణ పద్ధతులు తెలుసుకున్నారు. ఓపీఎంఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎన్ని దశలో రైతుల వివరాలను సేకరించి, నమోదు చేస్తున్నారో తెలుసుకున్నారు. రైతు ఊరు, ఆధార్ నంబర్, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎంత దిగుబడి వచ్చింది, నాణ్యతా ప్రమాణాలు ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేస్తున్నారో ఆలేరు వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులు తమిళనాడు బృందానికి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించడం పట్ల అధికారుల బృందం ప్రశంసించింది. అనంతరం వారిని సన్మానించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్‌రెడ్డి, డీసీఎస్‌ఓ రోజా, డీఎంఓ హరికృష్ణ, మార్కెట్ కమిటీ కార్యదర్శి పద్మ, ఎఫ్‌పీఓ చైర్మన్ స్వామి, ఏఈ శివకుమార్, సూపర్‌వైజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారి షణ్ముఖ సుందరం