
జమకాని వంట గ్యాస్ రాయితీ
ఆలేరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా మొత్తం 2,49,568 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 1,25,762 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ప్రస్తుతం సిలిండర్‌ను రూ.875 విక్రయిస్తున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.47 రాయితీగా ప్రతి వినియోగదారుడి ఖాతాలో జమచేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రూ.500కే సిలిండర్ ఇవ్వాలంటే ఒక్కో సిలిండర్‌కు రూ.328 ఆయా లబ్ధిదారుడి ఖాతాలో జమకావాలి. కానీ ఐదు నెలలుగా జమ కావడం లేదు.
జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు
జిల్లాలో దీపం గ్యాస్ కనెక్షన్లు 51,391 ఉండగా, ఉజ్వల్ కనక్షన్లు 13,997 ఉన్నాయి. డొమెస్టిక్ కనెక్షన్లు 1,85,979 ఉండగా, మొత్తం 2,49,568 కనెక్షన్లు ఉన్నాయి. 14 కిలోల సిలిండర్ ధర రూ.875 ఉండగా.. అందులో కేంద్రం రూ.47 రాయితీని 13 సిలిండర్ల వరకు వర్తింపజేస్తుంది. ఇదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి పరిమితులు ఏమైనా విధించిందా అనే ప్రశ్న లబ్ధిదారుల్లో తలెత్తుతోంది. జిల్లా అధికారులకు సైతం దీనిపై అవగాహన లేకపోవడంతో రాయితీ ఎందుకు జమకావడం లేదో సమాధానం ఉండడం లేదు.
ఫ ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు