
బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కొండమల్లేపల్లి: వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట్ల గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ బావి వద్దకు ఆదివారం ఆటోలో ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు ఆటోలో కూర్చోగా.. మిగతా వారు బావిలోకి దిగారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆటోలో నలుగురు మాత్రమే వెళ్లారు. ఇదంతా వ్యవసాయ బావి వద్ద పనిచేసే ఓ రైతు గమనించి బావి దగ్గరకి వెళ్లి చూడగా.. జత దుస్తులు, చెప్పులు ఉండటం గమనించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు బావి వద్దకు చేరుకుని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వ్యవసాయ బావి వద్దకు చేరుకొని దేవరకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచార ఇవ్వగా వారు వ్యవసాయ బావి వద్దకు చేరుకొని బావిలో గాలించగా.. వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 36 నుంచి 38 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని కొండమల్లేపల్లి ఎస్‌ఐ రామ్మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అనిశెట్టి దుప్పలపల్లిలో..
తిప్పర్తి: తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని, శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712670181 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.