
మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నాగార్జునసాగర్ : మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 12న నాగార్జునసాగర్‌కు రానుండటంతో శుక్రవారం నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైందని బుద్ధవనం ఓఎస్‌డీ సుదన్‌రెడ్డి తెలిపారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని ఈనెల 12వ తేదీన మిస్‌వరల్డ్ పోటీదారులు నాగార్జునసాగర్‌ను సందర్శించనున్న సందర్భంగా సాగర్‌లోని విజయ్‌విహార్, బుద్ధవనంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్‌వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ కు తీసుకువచ్చే ఓల్వో బస్సులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు శుక్రవారం ఒక బస్సును టూరిజం అధికారుల పర్యవేక్షణలో నాగార్జునసాగర్‌కు తీసుకువచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ బస్సు మొదటగా మిస్‌వరల్డ్ పోటీదారులు బస చేసే విజయ్‌విహార్ అతిథి గృహం, బుద్ధవనం చేరుకొని ఆ తరువాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లింది. ఈ సందర్భంగా ఓఎస్‌డీ సుదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మిస్‌వరల్డ్ పోటీదారులను హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు లగ్జరీ బస్సులో తీసుకువచ్చి తిరిగి వెళ్లే ప్రక్రియలో ఎంత సమయం పడుతుంది, అంతరాయం లేకుండా ఉండే రూట్ మ్యాప్ కోసం శుక్రవారం ట్రయల్‌రన్ చేసినట్లు తెలిపారు. ట్రయల్‌రన్‌లో టూరిజం ఎస్‌ఈ భాస్కర్‌రావు, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ శ్రీను నాయక్, ఎస్‌ఐ సంపత్‌గౌడ్, ఆర్‌ఐ దండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.