గుర్రంపోడు: వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, కరెంట్ తీగలను చోరీ చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను గుర్రంపోడు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఎస్‌ఐ పసుపులేటి మధు నిందితుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన దోటి సైదులు, దోటి శంకర్, దోటి అశోక్ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరు గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, కరెంట్ తీగలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం ఆరెగూడెం బస్ స్టేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సైదులు, శంకర్, అశోక్ కలిసి బైక్‌పై కరెంట్ తీగలు తీసుకుని వెళ్తుండగా.. వారిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి నాలుగు మోటార్లు, 80 మీటర్ల మోటారు కేబుల్ వైరును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.