వలిగొండ: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని వలిగొండ పోలీసులు గురువారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం కంచనపల్లి గ్రామ పరిధిలోని ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. తుర్కపల్లి మండలం బిలయ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన గుగులోతు రాములు తక్కువ ధరకు రేషన్ లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం సేకరించి నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
యువతి అదృశ్యం
త్రిపురారం: నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు గురువారం నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మడం గ్రామానికి చెందిన కొప్పుల మంజు హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన ఆమె ఇంటి వద్దనే ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో మంజు తల్లి లక్ష్మమ్మ ఇంట్లో నిద్రించింది. ఆమె నిద్రలేచి చూసేసరికి మంజు కనిపించలేదు. చుట్టుపక్కల బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా మంజు ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం మంజు తండ్రి శ్రీనివాస్ నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
కార్యదర్శికి గాయాలు
నార్కట్‌పల్లి: బైక్‌పై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శిని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో జరిగింది. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రవిశంకర్ గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు నల్లగొండ నుంచి ఎల్లారెడ్డిగూడేనికి బైక్‌పై వెళ్తుండగా.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో వెనుక నుంచి గుర్తుతెలియని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం రవిశంకర్‌ను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బైక్ ఢీకొని..
అడ్డగూడూరు: సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు శివారులో జరిగింది. చిర్రగూడూరు గ్రామానికి చెందిన బెల్గం సోమయ్య గురువారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద నుంచి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా.. కోటమర్తి గ్రామానికి చెందిన సతీష్ బైక్‌పై వెళ్తూ చిర్రగూడూరు గ్రామ శివారులో సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సోమయ్య కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.