వేసవిలో ఆకుకూరల సాగు– మెళకువలు | - | Sakshi
Sakshi News home page

వేసవిలో ఆకుకూరల సాగు– మెళకువలు

Mar 21 2025 1:49 AM | Updated on Mar 21 2025 1:44 AM

కలుపు నివారణ : అన్ని ఆకుకూరల పంటల్లో కలుపు నివారణకు పెండిమిథాలిన్‌ ఎకరాకు 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 14 గంటల్లో పిచికారీ చేసి, 30 రోజుల వరకు కలుపు నివారించవచ్చు.

సస్యరక్షణ : ఆకుకూరలను కూరగా వాడతారు కనుక వీలైనంత వరకు పురుగు మందులను వాడకపోవడమే మంచింది. వేప సంబంధిత పురుగు మందులను మాత్రమే వాడాలి. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పురుగుల నివారణకు మలాథియాన్‌ 2మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల నివారణకు లీటరు నీటికి కార్బెండాజిమ్‌ 1గ్రాము లేదా మ్యాంకోజెబ్‌ 2.5గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

నడిగూడెం: ఆకుకూరల్లో మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషక పదార్ధాలు లభిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో ఆకుకూరలు సాగుచేస్తే లాభాలు బాగుంటాయని హార్టికల్చర్‌ కన్సల్టెంట్‌ సుందరి సురేష్‌ చెబుతున్నారు.

ఫ వేసవిలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. వేడిగాలుల వలన భూమిలోని తేమ ఆవిరై మొక్కలు వాడిపోతాయి. ఒకవేళ నీరున్నా విద్యుత్‌ కొరత, లోఓల్టేజీ సమస్యల వలన కూడా నీటిని సక్రమంగా అందించలేకపోవచ్చు. అయితే కొద్దిపాటి మెళకువలు పాటించి వేసవి ఆకు కూరల సాగుతో అధిక లాభాలు పొందవచ్చు. వేసవిలో సాగునీటి సమస్య ఉంటుంది కాబట్టి తేమ నిలుపుకోగల్గిన బరువైన నల్ల భూములు ఆకుకూరల సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే ఎర్రనేలలు, ఇసుక నేలలు ఎంపిక చేసుకోవాలి. ఆకుకూర మడులకు తుంపర్ల పద్ధతిలో నీటిని అందిస్తే ఎండ తీవ్రత నుంచి ఆకుకూరలను కాపాడి అధిక దిగుబడులు సాధించవచ్చు.

అనువైన రకాలు : వేసవి సాగుకు తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, అనువైనవి.

తోటకూర : ఆర్‌.ఎస్‌.ఎ–1, అర్కాసుగుణ, పూసాకీర్తి, అర్కఅరుణ, ఎరుపు,

పాలకూర : ఆల్‌గ్రీన్‌, పూసా జ్యోతి, పూసాపాలక్‌,

మెంతికూర : పూసా ఎర్లీబంచింగ్‌, లాంసెలక్షన్‌–1,

కొత్తిమీర : సాధన ,స్వాతి,

గోంగూర : ఆంగ్రో–12, లోకల్‌, ఎర్ర గోంగూర రకాలను ఎంపిక చేసుకోవచ్చు.

విత్తే విధానం :

తోటకూర : 900–1000 గ్రాముల విత్తనం 10కిలోల ఇసుకతో కలిపి ఒత్తుగా చల్లాలి. ఎకరాకు 20కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 20కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి. కోత, కత్తిరింపు తర్వాత ఎకరాకు 10కిలోల నత్రజని అందించే ఎరువును వేసి నీరుపెట్టాలి.

పాలకూర : ఎకరాకు 12–15కిలోల విత్తనం, వరుసకు వరుసకు మధ్యన 12సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 10సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి. ఎకరాకు 10కిలోల నత్రజని, 10కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి.

మెంతికూర : ఇసుక, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రు నేలలు మెంతికూర పండించేందుకు అనుకూలం. 10–12కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని వెదజల్లవచ్చు లేదా వరుసలలో నాటవచ్చు. విత్తే ముందు విత్తనాన్ని నీటిలో నానబెట్టి వెదజల్లాలి. ఎకరాకు 10కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 20కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేయాలి.

కొత్తిమీర : మురుగు నీటి సౌకర్యం కలిగిన బంకనేలలు అనుకూలం. విత్తే ముందు గింజలను రెండు బద్దలుగా చేయాలి. విత్తనాన్ని వెదజల్లడం లేదా వరుసలలో వేయాలి. ఎకరాకు 5–6కిలోల విత్తనాన్ని 15సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి. ఎకరాకు 4కిలోల నత్రజని, 10కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేయాలి.

గోంగూర : ఎకరాకు 6–8కిలోల విత్తనాన్ని 60సెం.మీ. ఎడంగా తయారు చేసుకున్న బోదెలో 30సెం.మీ. దూరంలో వరుసలో విత్తుకోవాలి. ఎకరాకు 6కిలోల నత్రజని, 8కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి.

నీటి యాజమాన్యం : ఆకుకూర విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మళ్లీ మూడోరోజు నీరు పెట్టి నేల స్వభావాన్ని బట్టి తేలిక నేలలో 5–6 రోజుల వ్యవధిలో, బరువు నేలలో 8–10 రోజులకు ఒకసారి నీటి తడివ్వాలి. తోటకూర విత్తిన తర్వాత నెమ్మదిగా నీటిని పారించాలి. లేకపోతే నీటితో విత్తనం కొట్టుకపోయి మొలకశాతం తగ్గుతుంది. ఆకుకూరల్లో దిగుబడి ముఖ్యంగా వేసవిలో నీటి యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి కోత తర్వాత పైపాటు ఎరువులు చల్లి నీరు పెట్టాలి.

ఎరువుల యాజమాన్యం : బాగా దుక్కి చేసిన నేలలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 10–15 టన్నుల పశువుల ఎరువు 200 కిలోల వేప పిండి వేసి కలియదున్నాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు వాటితో పాటు జీవన ఎరువులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియ ఎరువులు వాడకం వలన నేల గుల్లబారి ఎక్కువ రోజులు తేమ నిల్వ ఉంటుంది. రెండు వరుసల మధ్య వరిగడ్డి, వేరుశనగ పొట్టు ఎండుటాకులు పరిస్తే నేలలో తేమ సంరక్షించబడును. ఆకు దిగుబడి పెంచడానికి 2శాతం యూరియా (20 గ్రాములు లీటరు నీటికి) జిబ్బరెల్లిక్‌ ఆమ్లం 50మి.గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల ఆకుకూరల్లో ఆకు దిగుబడి పెరుగుతుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.

వేసవిలో ఆకుకూరల సాగు– మెళకువలు1
1/1

వేసవిలో ఆకుకూరల సాగు– మెళకువలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement