హుజూర్‌నగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి హుజూర్‌నగర్ పట్టణ కేంద్రంలో జరిగింది. గురువారం స్థానిక ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నిమిషకవి సుబ్బారావు(45) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో సుబ్బారావు భార్య ఉమామహేశ్వరి నిద్ర లేచి చూసేసరికి భర్త కనిపించలేదు. దీంతో అతడి కోసం చుట్టుపక్కల మొత్తం వెతికింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో వారి ఇంటి పైకి వెళ్లి చూడగా స్లాబ్ ఎలివేషన్‌కి చున్నీతో సుబ్బారావు ఉరేసుకుని కనిపించాడు. రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపం చెందిన తన భర్త సుబ్బారావు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఉమామహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.