పెద్దవూర: చేపల చెరువు వద్ద విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన పెద్దవూర మండలం నాయినివానికుంటతండాలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయినివానికుంటతండాకు చెందిన రమావత్ కృష్ణ(36) తన వ్యవసాయ భూమిలో చేపల చెరువు తవ్వించి చేపలు పెంచుతున్నాడు. చేపల చెరువులో నీరు పెట్టడానికి గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లాడు. విద్యుత్ మోటారు ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై చెరువులో పడిపోయాడు. ఎనిమిది గంటలైనా కృష్ణ ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అతడి భార్య జ్యోతి చేపల చెరువు వద్దకు వెళ్లి చూడగా.. కృష్ణ తల నీటిలో మునిగి ఉండటంతో తండాలోని కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ ద్వారా విషయం చెప్పింది. తండావాసులు చెరువు వద్దకు చేరుకుని కృష్ణను బయటకు తీసి చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే కృష్ణ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.