సాసర్ పిట్‌లలో నీటిని నింపుతున్నాం
వేసవిలోఅడవి జంతువుల సంరక్షణకు గాను సాసర్ పిట్‌లలో నీటిని నింపుతున్నాం. అంతేకాకుండా వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నాం. అటవీ శివారు గ్రామాల్లో బేస్ క్యాంప్ హెల్పర్లు 24గంటలు కాపలాగా ఉంటారు. స్వచ్ఛంద సంస్థలు సైతం అడవుల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి.
– రాఘవేందర్,
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నాగార్జునసాగర్
నాగార్జునసాగర్: వేసవిలో తాగునీటికై వణ్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తున్న నేపథ్యంలో వాటి రక్షణకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. గత ఆరునెలలుగా వర్షాలు లేక అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు, నీటి జాలు గుంతలన్నీ వట్టిపోయాయి. దీంతో అడవి జంతువులకు తాగునీరు దొరకడం కష్టంగా మారింది. వాటి దాహాన్ని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో గతంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన సాసర్ పిట్‌లలో(నీటి తొట్లు) అటవీ శాఖ అధికారులు నీటిని నింపుతున్నారు. నెల్లికల్లు ఫారెస్ట్‌లోనే 25 సాసర్ పిట్‌లు ఏర్పాటు చేశారు. ఆ తొట్లలో వాతావరణాన్ని బట్టి 15రోజులకోమారు ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఆ నీటితోనే జంతువులు, పక్షులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. నీటి తోట్ల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా అమర్చారు. నీరు తాగేందుకు వచ్చే పక్షులు, జంతువుల చిత్రాలు కెమెరాల్లో నమోదవుతున్నాయి. ఆ కెమెరాల నుంచి ఫొటోలను డంప్ చేసుకుని వాటి బాగోగులను, ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తున్నారు. జంతు గణనకు కూడా ఇది తోడ్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా అడవిలో మనుబోతులు, ఎలుగుబంట్లు, నెమళ్లు, నక్కలు, కుక్కలు, దుప్పులు తదితర జంతువులు అత్యధిక సంఖ్యలో ఉండగా.. అవి వేటగాళ్ల ఉచ్చులు, వలలకు చిక్కకుండా వాచర్లు కాపాడుతున్నారు.
ఫ నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో సాసర్ పిట్‌లలో నీటిని నింపుతున్న ఫారెస్ట్ అధికారులు
ఫ సీసీ కెమెరాలతో జంతువులు,
పక్షుల కదలికలు నమోదు
వేసవిలో వణ్యప్రాణుల రక్షణకు చర్యలు
వేసవిలో వణ్యప్రాణుల రక్షణకు చర్యలు