తండ్రి, కొడుకు జీవచ్ఛవంలా..! | - | Sakshi
Sakshi News home page

తండ్రి, కొడుకు జీవచ్ఛవంలా..!

Mar 19 2025 1:44 AM | Updated on Mar 19 2025 1:44 AM

తండ్ర

తండ్రి, కొడుకు జీవచ్ఛవంలా..!

మోత్కూరు: వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి తండ్రి, కుమారుడు మంచానికే పరిమితమయ్యారు. చిన్న కుమారుడు కుటుంబ పోషణ కోసం పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. భర్త, కుమారుడి పరిస్థితి చూడలేక, పూట గడవక ఆ ఇల్లాలు పడుతున్న వేదన వర్ణనాతీతం. కుటుంబ భారం మోయలేక, నెలవారీ వైద్య ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతోంది. మోత్కూ రు మున్సిపల్‌ కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన వేముల పరశురాములుది నిరుపేద దళిత కుటుంబం. అతడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు అనిల్‌, సునీల్‌, కుమార్తె, వద్ధాప్యంలో ఉన్న తల్లి రామనర్సమ్మ ఉన్నారు. పరశురాములు మోత్కూరు పట్టణంలోని ఓ రైస్‌ మిల్లులో 25 ఏళ్లుగా హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి కూలీ పనులకు వెళ్తోంది. భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ కుమారులను చదివిస్తూ పెద్ద చేశారు. పెద్ద కుమారుడు వేముల అనిల్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదివి సెంట్రింగ్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రింగ్‌ పనిలో భాగంగా సుమారు ఆరేళ్ల క్రితం అనిల్‌ మోత్కూరు పట్టణంలో ఓ బిల్డింగ్‌కు సెంట్రింగ్‌ డబ్బాలు ఇప్పుతుండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ పైనుంచి కిందపడటంతో వెన్నుముక విరిగిపోయింది. కాళ్లు, చేతులు, నడుము సక్రమంగా పనిచేయలేకపోవడంతో పాటు కనీసం కూర్చోరాకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం కోసం హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి వెన్నపూస విరిగిపోయిందని చెప్పారు. అప్పటికే రూ.1.80 లక్షలు వైద్యానికి ఖర్చు చేశారు. 15 రోజులకు ఒకసారి, నెలకు నాలుగేళ్ల పాటు వెన్నముక నరాలకు సంబంధించిన ఇంజెక్షన్లు ఇప్పించాలని డాక్టర్లు చెప్పారు. ఒక్క ఇంజక్షన్‌ ఖరీదు సుమారు రూ.25వేలు ఉంటుందని, మందులకు రూ.10వేలు ఖర్చవుతుందని అన్నారు. అంత డబ్బు వెచ్చించలేక కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అనిల్‌ ఇంటి వద్ద మంచానికే పరిమితమయ్యారు. తల్లే దగ్గరుండి అన్ని సపర్యలు చేస్తుంది. పెద్ద కుమారుడు మంచానికే పరిమితం కావడంతో ఖర్చులు పెరగడంతో పరశురాములు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంతానికి వెళ్లి అడ్డా కూలీగా పనిచేయడం ప్రారంభించాడు. కొద్దిరోజుల తర్వాత పరశురాములు ఓ రోజు పని ముగించుకొని రాత్రి వేళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పరశురాములును సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో మెడ నరాలకు ఆపరేషన్‌ చేయించారు. అయినప్పటికీ బలమైన గాయాలు కావడంతో స్పర్శ రాకపోవచ్చని, కోలుకోవడం కష్టమేనని వైద్యులు తేల్చారు. పరశురాములు కూడా శరీరం స్పర్శ కోల్పోయి మంచానికే పరిమితమయ్యారు. కళ్లెదుటే భర్త, కుమారుడు మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా మారడంతో లక్ష్మి రోజువారి కూలీ పనులు మాని వారికి సపర్యలు చేస్తుంది. వద్ధాప్యంలో ఉన్న తన అత్తకు కూడా సేవలు చేస్తోంది. ఎలాగోలా 4 సంవత్సరాల క్రితం అతికష్టం మీద కుమార్తెకు వివాహం చేసి అత్తారింటికి పంపారు.

మా కుటుంబాన్ని ఆదుకోండి

నా పెద్ద కుమారుడు, భర్త మంచానికే పరిమితమయ్యారు. కదలలేరు, మెదలలేరు. సంపాదించిందే కాకుండా అప్పులు తెచ్చి వైద్యానికి సుమారు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశాం. ఉండే ఇల్లు తప్ప అమ్ముకోవడానికి గుంట భూమి లేదు. దాతలు ఎవరైనా మా కుటుంబాన్ని ఆదుకోండయ్యా. – వేముల లక్ష్మి

మంచానికే పరిమితం

సెంట్రింగ్‌ పనికి వెళ్లి బిల్డింగ్‌

పైనుంచి జారిపడ్డ కుమారుడు

రోడ్డు ప్రమాదంలో మెడ నరాలు

తెగి చచ్చుబడిన తండ్రి శరీరం

కుటుంబ పోషణ కోసం పెయింటర్‌గా పనిచేస్తున్న చిన్న కుమారుడు

దాతల సాయం కోసం ఎదురుచూపు

చిన్న కుమారుడిపై కుటుంబ భారం

పరశురాములు, లక్ష్మి దంపతుల చిన్న కుమారుడు సునీల్‌ డిగ్రీ వరకు చదివాడు. కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారడంతో పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ప్రతిరోజు కుటుంబం గడవడానికి అతడి సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రి, అన్న మందుల ఖర్చుల కోసం నెలకు సుమారు రూ.25 వేలకు పైగా వెచ్చిస్తున్నాడు. డబ్బుల భారం పెరిగిపోవడంతో ఇటీవల మందులను కొనుగోలు చేయడం ఆపేశారు. ప్రస్తుతం ఆ కుటుంబం దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతూ.. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

తండ్రి, కొడుకు జీవచ్ఛవంలా..!1
1/1

తండ్రి, కొడుకు జీవచ్ఛవంలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement