కేతేపల్లి: విజయవాడ – హైదరాబాద్ రహదారిపై కేతేపల్లి మండల కేంద్రంలో సోమవారం లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్ళడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన లారీ సోమవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. కేతేపల్లిలోని ఎస్సీ కాలనీ సమీపంలోకి రాగానే లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్లు, ఇనుప బారికేడ్లకు ఢీకొని డ్రైనేజీ కాల్వపై ఆగిపోయింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన కొబ్బరి బొండాల దుకాణాన్ని ఢీకొట్టడంతో దుకాణం ధ్వంసమైంది. దుకాణ నిర్వాహకులు పక్కకు పరుగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాహుల్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ ఇంజన్‌లో నుంచి పొగ, మంటలు రావటంతో అప్రమత్తమైన పోలీసులు నకిరేకల్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. డ్రైవర్ మద్యం మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు