సంస్థాన్ నారాయణపురం : భరత్.. బాగున్నావా.. ఎలా చదువుతున్నావు.. పరీక్షలకు సన్నద్ధం అయ్యావా.. అని పదో తరగతి విద్యార్థి దేవరకొండ భరత్‌ను కలెక్టర్ హనుమంతరావు పలకరించారు. ‘విద్యార్థుల ఇంటి తలుపు తట్టి’ కార్యక్రమంలో భాగంగా సంస్థాన్‌నారాయణపురం మండలం కంకణాలగూడెం పంచాయతీ పరిధిలోని దేశ్యాతండాలో నివాసం ఉంటున్న దేవరకొండ భరత్ చంద్రచారి ఇంటిని సోమవారం ఉదయం 7గంటలకు కలెక్టర్ సందర్శించారు. భరత్ చంద్రచారి, అతని కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. భరత్ చంద్రచారి నోట్ బుక్స్‌ను పరిశీలించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యావని అడిగారు. ఒత్తిడి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, నిర్దేశిత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి మైలు రాయి అని, ఉత్తీర్ణులైతే విజయానికి తొలి మెట్టు అవుతుందన్నారు. అతనికి రూ.5వేల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. భరత్ చంద్రచారి జీవితంలో స్థిరపడేవరకు తన సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణ ఉన్నారు. విద్యార్థుల ఇంటి తలుపు తట్ట్ఙే కార్యక్రమాన్ని గత నెలలో ఇక్కడి నుంచే కలెక్టర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఫ పరీక్షలకు సన్నద్ధం అయ్యావా..
ఫ దేశ్యతండాలోని టెన్త్ విద్యార్థి భరత్ ఇంటిని సందర్శించిన కలెక్టర్
ఫ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందజేత