గుండాల : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, కాళేశ్వరం ద్వారా చెరువులు, కుంటలు నింపకపోవడం వల్లే నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. గుండాల మండలానికి నవాబు పేట రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. మొదటి రోజు దేవాదుల కాల్వ వెంట వెల్మజాల గ్రామం వరకు పాదయాత్ర కొనసాగింది. బూర్జుబావి గ్రామ పరిధిలో ఎండిన వరి చేలను పరిశీలించారు. రైతు చెట్లపల్లి రాజయ్య ఏడు ఎకరాల్లో వరి సాగు చేయగా నీరందక ఆరు ఎకరాలు ఎండిపోయిందని ఆమె కాళ్లపై పడి విలపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిహారం వచ్చేలా చూ డాలని వేడుకోగా అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు 33 మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తే నవాబుపేట రిజర్వాయర్ నిండి మండలానికి సాగు నీరు వచ్చేదన్నారు. గతంలో గుండాల మండలం సాగు నీటితో కళకళలాడేదని, నేడు పంటలు ఎండిపోయి ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎండీ ఖలీల్, నాయకులు బాల్‌రెడ్డి, కె.రాములు, సంగి బాలకష్ణ, బబ్బూరి సుధాకర్, మూగల శ్రీనివాస్, మాధవరెడ్డి, సోమన్న, దయాకర్, నాగరాజు, పూర్ణచంద్, సంగి బాలకొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
ఫ సాగు నీటికోసం పాదయాత్ర
పంటలు ఎండటం ప్రభుత్వ వైఫల్యమే..