
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బదిలీ
సాక్షి, యాదాద్రి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ బదిలీ అయ్యారు. హెచ్‌ఎండీఏ సెక్రటరీగా ఆయనను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది మార్చి 16న ఆయన అదనపు అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా సంవత్సరానికి ఆయన బదిలీ అయ్యారు. జిల్లాలో తాగు నీటి ఎద్దడి నివారణ, రానున్న స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు చర్యలు చేపట్టడంలో ఆయన సమర్థవంతంగా పనిచేశారు. మున్సిపాలిటీల వారీగా సమీక్షలు, మేళాలు నిర్వహించి వీలైనంత ఎక్కువ మందిని ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేలా సఫలీకృతం అయ్యారు. పాలనాపరంగా సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. కాగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బాధ్యతలను రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డికి అప్పగించారు.
39వ సారి రక్తదానం
మోత్కూరు : మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి నవీన్ ఆదివారం 39వ సారి రక్తదానం చేశాడు. నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీహెచ్ లక్ష్మయ్య అనే పేషెంట్‌కు బి పాజిటివ్ రక్తం అవసరమైంది. మిర్యాలగూడ ఫ్రెండ్స్ ఫౌండేషన్ కార్యదర్శి లింగరాజు తానకు ఫోన్ చేయడంతో వెంటనే వెళ్లి రక్తదానం చేసినట్లు నవీన్ తెలిపారు. ఆపదలో ఉన్న వ్యక్తులకు తాను రక్తదానం చేస్తూ, తన మిత్రులతోనూ చేయిస్తున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రాణాలను కాపా డినవారం అవుతామన్నారు.
ఒంటిపూట బడుల
వేళల్లో మార్పులు
భువనగిరి : ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటలకు మొదటి గంట, 8.05 గంటలకు రెండో గంటతో పాటు ప్రార్థన చేసి 8.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని మొదట ఆదేశాలు ఇచ్చింది. ఈ వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఉదయం 7.45కు మొదటి గంట, 7.50కి రెండో గంటతో పాటు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు నిర్వహించిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సవరించిన వేళలను అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఆదేశించారు. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ యాజమాన్యాలు ఒంటిపూట బడులు నిర్వహించాలని సూచించారు.