
ఆహ్లాదం.. ఆకర్షణీయం
భువనగిరి : జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు కొత్తరూపును సంతరించుకుంది. కట్టపై, దిగువన చేపడుతున్న సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది వస్తుంటారు. యాదగిరీశుడి సన్నిధికి వెళ్లిన భక్తులు సైతం ఇక్కడ ఆగి సేదదీరుతుంటారు. వీరితో పాటు స్థానికులు ఆహ్లాదంగా గడిపేందుకు హెచ్‌ఎండీఏ నిధులు రూ.6.20 కోట్లతో కట్టపై కిలోమీటరు పొడవునా సుందరీకరకణ పనులకు ఏడాదిన్నర కిత్రం శ్రీకారం చుట్టారు. పనులు ఆగుతూ.. సాగుతూ ఎట్టకేలకు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది.
2023 ఆగస్టులో పనులు ప్రారంభం
పెద్దచెరువు కట్ట సుందరీకరణ పనులను 2023 ఆగస్టులో రూ.6.20 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఇందులో గ్రీనరీకి రూ.1.20 కోట్లు, వివిధ నిర్మాణాలకు రూ. 5 కోట్లు కేటాయించారు.
నాటిన మొక్కలు ఇవీ..
గ్రీనరీలో భాగంగా ఆక్సీజన్ అందించే లెమన్, ఫౌంటేయిన్ గ్రాస్ మొక్కలు, సుందరంగా కనిపించేందుకు పీచ్ లిల్లీ, మిర్చి మేరి గోల్డ్, రాయల్ ఫామ్స్ చెట్లతో పాటు వివిధ ప్రాంతాల్లో కార్పొరేట్ గ్రాస్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వివిధ రంగులతో పూలు పూచే బోగన్ విల్లా, టెకోమా మొక్కలు, రెండు గజ్‌బోలు ఏర్పాటు చేస్తున్నారు.
నిర్మాణాలు..
మరుగుదొడ్లు, ప్రవేశద్వారం, రేలింగ్, కట్ట వెడల్పు, కట్ట బలోపేతం చేయడంతో పాటు రాతి కట్టడాలు చేస్తున్నారు. రూ.98 లక్షలతో కట్టపై భారీ జాతీయ పతాకం, భువనగిరి లవ్ చిహ్నం ఏ ర్పాటు చేశారు. ఆలాగే విద్యుత్‌దీపాలు, పార్కులు, వ్యూ పాయింట్, బోటింగ్ తదితర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భువనగిరి పెద్దచెరువుకు పర్యాటక సొబగులు
రూ.6,20 కోట్లతో సుందరీకరణ
చివరి దశకు చేరిన పనులు
త్వరలో అందుబాటులోకి
తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు
సందర్శకులతో సందడిగా..
హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పక్కన పెద్ద చెరువు ఉంది. చెరువు నిండా నీరు ఉండడంతో పాటు ఆహ్లదం పంచే వివిధ రకాల మొక్కలు, గ్రీనరీ, నిర్మాణాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఉదయం వాకర్స్, సాయంత్రం స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన వారు చెరువు వద్ద ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ ఆటపాటలతో అనందంగా గడుపుతుండడంతో సందడి నెలకొంది.

ఆహ్లాదం.. ఆకర్షణీయం

ఆహ్లాదం.. ఆకర్షణీయం