మోత్కూరు : రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు వెంటనే ఫీజు బకాయిలు చెల్లంచాలని, లేనిపక్షంలో వార్షిక పరీక్షలు నిర్వహించబోమని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు మారం నాగిరెడ్డి హెచ్చరించారు. సంఘం కార్యదర్శి ఎం.సైదారావు, ఉపాధ్యక్షుడు సీహెచ్ సత్యంగౌడ్‌తో కలిసి శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, ఎగ్జామ్ కంట్రోలర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని, ఆర్‌టీఎఫ్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని గత, ప్రస్తుత ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేశారు. కానీ, నెలల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడం వల్ల అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి కళాశాలలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేమని స్పష్టం చేశారు.