భువనగిరి : ఇంటి పన్ను ఎక్కువగా వస్తుందా.. పన్నుల విధింపులో లోపాలున్నాయా.. ఒకే ఇంటికి రెండు నంబర్లు ఉన్నాయా.. ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకు మున్సిపల్ యంత్రాంగం రెవెన్యూ మేళాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఈనెలాఖరు వరకు మేళాలు కొనసాగనున్నాయి.
ఎక్కువగా ఉన్న సమస్యలు ఇవీ..
జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 37,126 నిర్మాణాలు ఉన్నాయి. ప్రధానంగా ఆస్తిపన్ను ఎక్కువగా వస్తుందని, తప్పుడు కొలతలు, ఒకే ఇంటికి రెండు నంబర్లు, ఇంటి నంబర్ ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడం, యజమాని పేరు మార్పిడి, నివాస గృహాలకు వాణిజ్య పన్ను రావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు రివిజన్ పిటిషన్లూ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు అన్ని మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమ, గురువారాల్లో మార్చి 31వ తేదీ వరకు మేళాలు నిర్వహించనున్నారు. వాటిలో దరఖాస్తు చేసుకుంటే సమస్యను పరిష్కరిస్తారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపు, మదింపునకు సంబంధించి సమస్యలు ఉంటే రెవెన్యూ మేళాలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తాం. ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు అందుబాటు ఉంటారు. రెవెన్యూ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– రామలింగం,
భువనగిరి మున్సిపల్ కమిషనర్
మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలు
ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10నుంచి ఒంటి గంట వరకు
ప్రత్యేక కౌంటర్ల ద్వారా
దరఖాస్తుల స్వీకరణ
సందేహాల నివృత్తికి సంప్రదించాల్సిన నంబర్ 63042 34141
ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు అందకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జతపర్చాల్సి ఉంటుంది.
డోర్ నంబర్ కోసం : అసెస్మెంట్ కాపీ
పేరు మార్పునకు: మ్యుటేషన్ కాపీ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇల్లు తీసేసినట్టయితే ఇంటి పన్ను రద్దు కోసం: ఫొటో, చివరిగా చెల్లించిన ఇంటి పన్ను రశీదు
ఇంటి పన్ను ఎక్కువ వచ్చినట్లయితే : అసెస్మెంట్ కాపీ, ఇంటి ఫొటో, సంబంధిత డాక్యుమెంట్
డబుల్ అసెస్మెంట్ :
ఇంటి నిర్మాణ అ నుమతి,అసెస్మెంట్ నంబర్, మొదటగా చెల్లించిన ఇంటి పన్ను రశీదు.
నిర్మాణాలు ఇలా..
మున్సిపాలిటీ నిర్మాణాలు
భువనగిరి 14,245
చౌటుప్పల్ 6,675
ఆలేరు 4,124
యాదగిరిటుట్ట 4,354
పోచంపల్లి 3,879
మోత్కూర్ 3,849