
కృత్రిమమేధతో బోధన
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుంచి అమలు
20 నిమిషాల వ్యవధిలో పాఠం
ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో విద్యార్థులను ఆకట్టుకునేలా ఏఐ బోధన అందిస్తారు. ఎంపిక చేసిన 3 నుంచి 5 తరగతుల విద్యార్థులను అయిదుగురికి ఒక బ్యాచ్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో బ్యాచ్‌కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తారు. ఆ విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా, లేదా అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో బోధిస్తుంది. అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తుంది. ఇలా ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు, గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి ఆయా విద్యార్థులపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు.
జిల్లాలోని ఏడు మండలాల్లో తొమ్మిది పాఠశాలలు ఎంపిక
చదువులో వెనుకబడిన
పిల్లలకు ప్రత్యేక తరగతులు
ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కొత్త కార్యక్రమం
ఇప్పటికే టీచర్లకు శిక్షణ పూర్తి
భువనగిరి: సర్కారు బడుల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ) సాయంతో విద్యార్థులను ఆకట్టుకునేలా, సులభ రీతిలో వినూత్న బోధన చేయనుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో శనివారం నుంచి పాఠ్యాంశాలు బోధించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 మండలాల నుంచి 9 పాఠశాలలు ఎంపికయ్యాయి. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో ఏఐ విధానాన్ని మిగతా అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.
నిపుణులైన ఉపాధ్యాయులకు శిక్షణ
ఏఐ బోధనకు ప్రతి జిల్లాలోనూ కొన్ని పాఠశాలలను గుర్తించి ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో బోధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయ అధికారులకు ఈనెల 11న రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కాగా జిల్లా కేంద్రంలో ఈనెల 12న సంబంధిత ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, పాఠశాల ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఏఐ బోధనపై శిక్షణ కూడా ఇచ్చారు. ఎంపికై న పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభంకానుంది.
మెరుగైన సామర్థ్యాల సాధనకు..
ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో మౌలిక భాష, సంఖ్యా జ్ఞానం అభ్యసనతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లోనూ ఆశించిన స్థాయి సామర్థ్యాలు సాధించకపోవడంతో విద్యలో వెనుకబాటుకు గురవుతున్నారు. పలు రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.
చదవడం, రాయడం సులభంగా అలవడుతుంది
చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ బోధన ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పాఠశాలలో మూడు రకాల విద్యార్థులు ఉంటారు. ఇందులో మూడో రకం విద్యార్థులకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేసే బోధనకు అదనంగా ఏఐ బోధన ఉంటుంది. దీని వల్ల విద్యార్థికి చదవడం, రాయడం సులభంగా అలవడుతుంది. కంప్యూటర్ స్క్రీన్‌పై ఏఐ బోదన రోజూ 20 నిమిషాలు ఉంటుంది.
–సత్యనారాయణ, డీఈఓ
ఎంపికై న పాఠశాలలు ఇవీ..
ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ భోదనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో చౌటుప్పల్ మండలంలోని జైకేసారం, దేవలమ్మనాగారం, యాదగిరిగుట్ట మండలంలో పెద్దకందుకూరు, చొల్లేరు, ఆలేరు మండలంలో కొల్లూరు, మోటకొండూరు మండలంలో ముత్తిరెడ్డిగూడెం, భువనగిరి మండలంలో తుక్కాపురం, బీబీనగర్ మండలంలో జమిలాపేట, రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం పాఠశాలలు ఉన్నాయి.

కృత్రిమమేధతో బోధన