
వినియోగదారుడా మేలుకో..
ఫ ఈ– కామర్స్ అనుచిత వ్యాపార
విధానాల కట్టడికి ఈ చట్టంలో
నిబంధనల రూపకల్పన
ఫ తప్పుదారి పట్టించే ప్రకటనలు
వెలువరించిన తయారీదారులు,
అమ్మకందారులకు జరిమానా
ఫ నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
వస్తువుల కల్తీ, నాణ్యతలేమి సమస్యల పరిష్కారానికి రాజదండంలా వినియోగదారుల రక్షణ చట్టం
రామగిరి(నల్లగొండ): వినియోగదారుల వివాదాల పరిష్కారానికి భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల ఫోరం చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులకు వస్తు లోపం, సేవా లోపం తలెత్తితే ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. ఈ సేవలు మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం– 2019ను తీసుకువచ్చింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీదారులకు శిక్షలు, కల్తీ వస్తువుల అమ్మకం లాంటి విషయాల్లో అనేక నిబంధనలను ఈ చట్టంలో పొందుపరిచారు. ఇది వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అమలు చేయడానికి పనిచేస్తుంది. హక్కుల ఉల్లంఘన జరిగినా, అనుచిత వ్యాపార విధానాలు అవలంబించినట్లు తెలిసినా, తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించినా.. వాటిపై దర్యాప్తు జరిపి వాటి తయారీదారులు, అమ్మకందారులు, ప్రకటనల ప్రచురణ, ప్రసారకర్తలకు జరిమానాలు విధిస్తుంది. మెడికల్, ఇన్సూరెన్స్, అగ్రిమెంట్, విద్యుత్ ప్రమాదాలు, నాసిరకం విత్తనాలు, చిట్‌ఫండ్, ఎమ్మార్పీ కంటే ఎక్కువ విక్రయించినా, వస్తువుల నాణ్యత వంటి సమస్యలు తలెత్తినా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. ఈ–కామర్స్ వేదికల అనుచిత వ్యాపార విధానాలు అవలంబించకుండా అడ్డుకోవడానికి కూడా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.
పరిష్కారం సులభతరం
వినియోగదారుల వివాదాలను సులభంగా పరిష్కరించేందుకు కొత్త చట్టం ప్రాధాన్యమిచ్చింది. ఫిర్యాదులను ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయొచ్చు. వినియోగదారులు తన నివాస ప్రాంతంలోని కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ ఫిర్యాదును 21 రోజుల్లోగా ఆమోదించినట్లు చెప్పకపోతే దానంతట అదే ఆమోదించబడినట్లుగా భావిస్తారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ జరుపుతారు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నిబంధనల ప్రకారం రూ.5లక్షల లోపు కేసులు దాఖలు చేయడానికి ఎలాంటి రుసుము ఉండదు.
వినియోగదారుల హక్కులు
● జీవితం మరియు ఆస్తికి ప్రమాదకరమైన వస్తువులు, ఉత్పత్తుల సేవల అమ్మకాల నుంచి వినియోగదారులు రక్షణ పొందే హక్కు.
● అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి వినియోగదారుడిని రక్షించడానికి, వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ప్రామాణికం, ధరల గురించి తెలియజేసే హక్కు.
● భరోసా పొందే హక్కు
● వినడానికి, వినియోగదారుల ప్రయోజనాలకు తగిన వేదిక వద్ద తగిన పరిశీలన లభిస్తుందని హామీ ఇచ్చే హక్కు.
● నిర్బంధ వాణిజ్య పద్ధతులు లేదా వినియోగదారుల అనాలోచిత దోపిడీకి వ్యతిరేకంగా పరిష్కారాన్ని కోరే హక్కు.
● వినియోగదారుల అవగాహన హక్కు.
కేసుల వివరాలు (2020–2025)
సంవత్సరం నమోదైన పరిష్కారమైనవి పెండింగ్
కేసులు
2020 81 78 3
2021 107 100 7
2022 100 88 12
2023 124 80 44
2024 157 29 128
2025 13 – 13