
రూ. 309 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు
నల్లగొండ టూటౌన్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టడానికి, అదనపు భవనాల నిర్మాణం, అధ్యాపకుల నియామకంతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.309.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు విద్యాధరరెడ్డి, మృణాళిని, శోభారాణి బృందం బుధవారం ఎంజీయూను సందర్శించి పలు భవనాలను, సదుపాయాలను పరిశీలించారు. పానగల్ క్యాంపస్‌ను సందర్శించి అక్కడ ఇంజనీరింగ్ కళాశాల, స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వీసీ తన చాంబర్‌లో అభివృద్ధి ప్రతిపాదనలను, యూనివర్సిటీ స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ గవర్నర్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్, బీఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వీసీ తెలిపారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్ల బృందానికి వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఓఎస్‌డీ కొప్పుల అంజిరెడ్డి, డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆవుల రవి, దోమల రమేష్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి, ప్రిన్సిపాల్స్ సుధారాణి, కె. ప్రేమ్‌సాగర్, హరీష్‌కుమార్, సీఓఈ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంజీయూలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని కోర్సులు
ఫ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
ఫ యూనివర్సిటీని సందర్శించిన
ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ల బృందం