
అన్న ప్రసాదానికి రూ.5లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులను నిత్యాన్న ప్రసా దం అందించేందుకు గాను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన కర్నాటి రమేష్, శ్రీదేవి దంపతులు రూ.5లక్షల విరాళం ప్రకటించారు. బుధవారం స్వామి వారిని దర్శించుకున్న రమేష్, శ్రీదేవి దంపతులు ఈఓ భాస్కర్‌రావును కలిసి రూ.5లక్షల చెక్కు అందజేశారు.
రామన్నపేటలో
ఆరు రైళ్లను ఆపాలి
ఫ భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి
రామన్నపేట: ఐదేళ్ల క్రితం కరోనా లాక్‌డౌన్ సమయంలో రామన్నపేట రైల్వే స్టేషన్‌లో ఆగకుండా రద్దు చేసిన ఆరు రైళ్లను తిరిగి ఆపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. బుధవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. రామన్నపేట మండలంలో యాభై వేలకు పైగా జనాభా నివసిస్తున్నారని, ఇక్కడ డిగ్రీ కళాశాల, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, సబ్ కోర్టుతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, ఇక్కడ రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం రైళ్లను ఆశ్రయిస్తుంటారని ప్రస్తావించారు. ప్రజల సౌకర్యార్ధం రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, ఫలక్‌నుమా, చైన్నె, శబరి, డెల్టా ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు కాచిగూడ–మిర్యాలగూడ మధ్య నడిచే డెమో రైళ్లను ఆపాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.
హైనా దాడిలో
లేగ దూడ మృతి
చండూరు (గట్టుప్పల్): హైనా దాడి చేయడంతో లేగ దూడ మృతిచెందింది. ఈ ఘటన గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అంతంపేట గ్రామానికి చెందిన భీమనపల్లి యాదయ్య తన వ్యవసాయ భూమిలో వేసిన కొట్టంలో మంగళవారం రాత్రి లేగ దూడతో పాటు మరికొన్ని మూగజీవాలను కట్టేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం కొట్టం వద్దకు వచ్చి చూసేసరికి లేగ దూడ మృతిచెంది కనిపించింది. హైనా దాడి చేయడంతో లేగ దూడ మృతిచెందిందని బాధిత రైతు పేర్కొన్నాడు. ఘటన జరిగిన ప్రాంతం గుట్టకు దగ్గరగా ఉండటంతో అక్కడ హైనాలు కనిపిస్తుంటాయని రైతులు చెబుతున్నారు.
ఉరేసుకుని
వివాహిత ఆత్మహత్య
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన ఉరే సతీష్‌కు సూర్యాపేటకు చెందిన సాయిసుధ(29)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. సతీష్‌కు ఇటీవల కేతేపల్లి మండలంలోని మూసీ గురుకుల పాఠశాలలో పీఈటీగా ఉద్యోగం వచ్చింది. దీంతో సతీష్ తన భార్య సాయిసుధ, కుమార్తె, కుమారుడితో కలిసి రెండు నెలల క్రితం నకిరేకల్‌లోని డాక్టర్స్ కాలనీలో అద్దె ఇంట్లో దిగారు. రోజుమాదిరిగా బుధవారం కూడా సతీష్ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. పై అంతస్తులో ఉంటున్న తన పోర్షన్‌లోకి వెళ్లి తలుపు తీసేసరికి తన భార్య సాయిసుధ గదిలోని వెంటిలేటర్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే సతీష్ తన అత్తమామలకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి సాయిసుధ మతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

అన్న ప్రసాదానికి రూ.5లక్షల విరాళం