
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి బలవన్మరణం
చిట్యాల: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జరిగింది. బుధవారం ఎస్‌ఐ ఎన్. ధర్మా తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఆలకుంట్ల రాజు(27) తన భార్య సద్గుణ, ఇద్దరు పిల్లలతో కలిసి కొతకాలంగా హైదరాబాద్‌లోని బోరబండలో నివాసముంటున్నాడు. అక్కడ డ్రిల్లింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పెద్దకాపర్తి గ్రామంలో జరిగిన తిరుమలనాథస్వామి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు కుటుంబంతో కలిసి వచ్చాడు. సోమవారం తిరిగి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. మంగళవారం మళ్లీ పెద్దకాపర్తి గ్రామానికి వచ్చిన రాజు గ్రామంలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి పది గంటల సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మృతుడి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. రాజు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య సద్గుణ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.