
చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట: చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం లభించింది. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. మంగళవారం సాయంత్రం అటువైపు వెళ్తున్న వ్యక్తులు శిశువును గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి శిశువు మృతిచెందిందని పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శిశువు మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రసవించిన వారి వివరాలను సేకరిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పురుగుల మందు తాగి కూలీ ఆత్మహత్య
నకిరేకల్: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య(45) నకిరేకల్‌కు వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లింగయ్య సోమవారం రాత్రి స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి లింగయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు ధనుష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
ఫలితాలు వాయిదా
వేయాలని ధర్నా
నల్లగొండ టౌన్ : రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్–1, 2, 3, హాస్టల్ వెల్ఫేర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను వాయిదా వేయాలని కలెక్టరేట్ ఎదుట మంగళశారం ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫలితాలు ప్రకటించడం వల్ల ఎస్సీ ఉప కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగి శ్రీశైలం, బోడ సునీల్, బకరం శ్రీనివాస్, గాదె రమేష్ పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్లలోని
కాపర్ వైరు చోరీ
మునగాల: మండల కేంద్రం శివారులో గల ఎల్–33 ఎత్తిపోతల పథకం రెండవ స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. చోరీ జరిగినట్లు మంగళవారం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన కాపర్ వైరు విలువ సుమారు రూ.4లక్షలకు పైగా ఉంటుందని తెలిసింది.