మత్స్యకారులు విలవిల | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు విలవిల

Apr 12 2024 2:05 AM | Updated on Apr 12 2024 2:05 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి : తీవ్ర వర్షాభావం కారణంగా మత్స్యకారులకూ గడ్డుకాలం దాపురించింది. చెరువులు, కుంటల్లో నీరు అడుగంటుతుండడం, మరోవైపు ఎండలు ముదరడంతో చేపలకు ముప్పు పొంచి ఉంది. కొన్నిచోట్ల మత్స్యకార్మికులు వ్యవసాయ బోర్ల ద్వారా చెరువులను నింపుతూ మత్స్య సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.మరికొందరు నష్టాలకు చేపలను అమ్ముకుంటున్నారు. జిల్లాలో మొత్తం 784 చెరువులు ఉండగా 693 చెరువుల్లో రూ.2.76 కోట్లు విలువ చేసే చేప పిల్లలు పోశారు. అందులో 128 చెరువులు ఎండిపోయాయని అధికారిక లెక్కలు చెబుతున్నా వాటి సంఖ్య ఎక్కువగానే ఉంది. గడిచిన ఐదారేళ్లలో ఎన్నడూ ఇంతటి కరువు చూడలేదని, ఈ సంవత్సరం తమ పరిస్థితి దయనీయంగా ఉందని మత్స్యకార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాన్‌ అయకట్టులో చెరువులన్నీ వెలవెల

గత ఐదారేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురిశాయి. గోదావరి జలాలు కూడా రావడంతో మండు వేసవిలోనూ చెరువులు నీటితో కళకళలాడాయి. ఈ ఏడు వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే చాలా చెరువులు, కుంటలు వట్టిపోయాయి. ప్రధానంగా నాన్‌ ఆయకట్టు మండలాలైన చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, బొమ్మలరామారం, రాజాపేట, మోటకొండూరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో చెరువులు నెర్రెలుబారాయి. గతంలో చెరువుల నిండా నీళ్లు ఉండడం మూలంగా చేపలు పట్టలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కొద్దిపాటి నీరే ఉండడం, ఎండ తీవ్రతకు చనిపోతుండడంతో పట్టి ఎంతోకొంతకు విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం ఇలా..

● చౌటుప్పల్‌ పట్టణంలోని ఊరచెరువులో ప్రస్తుతం గుంతల్లోనే నీరు ఉంది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే పొలాలకు, నివాస గృహాలకు సమస్య ఉండదు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది.

● రాజాపేట మండల పరిధిలో నీటిపారుదల శాఖకు చెందిన 10 చెరువులు ఉన్నాయి. వీటి కింద సుమారు 1,581 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పది చెరువుల్లో ఏడు పూర్తిగా వట్టిపోయాయి. బొందుగుల, రాజాపేట, దూది వెంకటాపురం చెరుల్లో కొద్దిగా నీరు ఉంది. మరో 50 కుంటలు ఉండగా పూర్తిగా ఎండిపోయాయి.

● భూదాన్‌పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి, దోతిగూడెం, చెరువుల్లో నీరు అడుగంటింది. గతంలో పిల్లాయపల్లి కాల్వకు పైప్‌లైన్‌ వేసి దోతిగూడెం చెరువును నింపేవారు. మోటార్లు మరమ్మతులకు గురవడంతో ఈసారి చెరువు నింపలేదు.

● గుండాల పెద్ద చెరువులో కోపుల్లో మాత్రమే నీరుంది. మండలంలోని 20 గ్రామాల్లో 11 చెరువులు, 76 కుంటలు ఎండిపోయాయి.

● ఆత్మకూరు (ఎం) మండలం రాయిపల్లి పలుగు చెరువు పూర్తిగా వట్టిపోయింది. కప్రాయిపల్లి చెరువు ఎండిపోవడంతో అందులో పెంచుతున్న చేపలను బతికించేందుకు మత్స్యకార్మికులు వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకొని నీటిని నింపుతున్నారు.

● బొమ్మలరామారం మండలంలో 85 చెరువులు ఉండగా అందులో 60 చెరువుల్లో నీటి అడుగుకు చేరింది. చెరువుల్లో చేపలు పెంచుతున్న మత్స్యకారులు ఆర్థికంగా చాలా నష్టపోయారు.

ఆత్మకూర్‌(ఎం) మండలం కప్రాయపల్లి చెరువుపై ఆధారపడి 20 మత్స్య పారిశ్రామిక కుటుంబాలు జీవిస్తున్నాయి. ఐదు నెలల క్రితం రూ.50వేలు విలువ చేసే చేప పిల్లలు పోశారు. చెరువులో సమృద్ధిగా నీరు లేకపోవడంతో చేప పిల్లలు ఎదగలేదు. ప్రస్తుతం పావు కిలో సైజు మాత్రమే ఉన్నాయి. వర్షాలు లేకపోవడం, ఎండలు ముదరడంతో చెరువులో నీరు అడుగుకు చేరింది. చేపలను బతికించుకునేందుకు వ్యవసాయ బోరును అద్దెకు తీసుకొని చెరువులో నీళ్లు పెడుతున్నారు. ఈ సమయానికి చేపలు కిలో సైజు పెరగాలని, చెరువులో నీరు లేకపోవడంతో వేలాది రూపాయలు నష్టపోవల్సి వస్తుందని మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు జిల్లాల శ్రీను వాపోయారు.

వట్టిపోయిన చౌటుప్పల్‌ చెరువు                          రాజాపేట మండలంలోని మొల్లగూడెం చెరువు..1
1/3

వట్టిపోయిన చౌటుప్పల్‌ చెరువు రాజాపేట మండలంలోని మొల్లగూడెం చెరువు..

2
2/3

భూదాన్‌పోచంపల్లి మండలంలోని 
జిబ్లక్‌పల్లి చెరువులో అడుగంటిన నీరు3
3/3

భూదాన్‌పోచంపల్లి మండలంలోని జిబ్లక్‌పల్లి చెరువులో అడుగంటిన నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement