వడదెబ్బపై అవగాహన కల్పిస్తున్నాం
అప్రమత్తంగా ఉండాలి
● వేసవి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యలు
● అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు
భీమడోలు: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే కొన్ని రోజులు వేడి గాలులతో పాటు ఉక్కపోత పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. సాధారణంగా మే నెల తొలి వారంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు, ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. జిల్లాలో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతోంది.
వడదెబ్బ ప్రభావంపై విస్తృత ప్రచారం
దీనివల్ల రెక్కల కష్టంపై బతికే బడుగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు, రోగులు, శ్రమజీవులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారంతా అనారోగ్యానికి గురై వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వేసవి దృష్ట్యా మానవుని శరీరంలో సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. శరరంలో లవణాలు కోల్పోవడంతో దుష్ఫరిణామాల వల్ల ప్రాణాంతకం కావచ్చు. అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయక మరణం సంభవించవచ్చు. సత్వరం చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు నీటి లోపం, జీర్ణ సంబంధ వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు, చర్మ సమస్యలు, మూత్ర సంబంధ సమస్యలు, తలనొప్పి, ఎలక్ట్రోలైట్ లోపం వల్ల కలిగే మూర్ఛల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఎల్‌నినోనే కారణం
ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు ఎల్‌నినో ప్రభావమే కారణమని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ప్రక్రియ కారణంగా ఈ వేసవి గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని, వర్షాలు సైతం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయని వివరిస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు – జాగ్రత్తలు
వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతంగా పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మగత నిద్ర, కలవరింతలు, పెదవులు తడిబారిపోవడం వంటివి కనిపిస్తాయి. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందించాలి. వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలేలా చూడాలి. శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్‌ఎస్ తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించరాదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి.
నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● ఎండలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టోపీ, గొడుగు లేదా తలపాగా ధరించాలి.
● తేలికపాటి నూలు (కాటన్) వస్త్రాలు ధరించడం మంచిది.
● వేడి గాలి ఇంట్లోకి రాకుండా కిటికీలకు పరదాలు లేదా గోనె సంచులు అడ్డుగా కట్టాలి.
● ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి.
● రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి.
చేయకూడనివి
● మధ్యాహ్నం వేళ ఎండలో ఎక్కువగా తిరగరాదు.
● మద్యం సేవించరాదు.
● రోడ్లపై అమ్మే రంగు పానీయాలు, కలుషిత ఆహార పదార్థాలను తినరాదు.
● మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయలు తీసుకోవాలి.
● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు లేకుండా చూసుకోవాలి.
పీహెచ్‌సీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. పంచాయతీల్లో వీటిని అందుబాటులో ఉంచాం. బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
– ఆర్.జాహ్నవి కృష్ణ, వైద్యాధికారిణి, గుండుగొలను
వేసవిలో వడదెబ్బతో పాటు విరోచనాలు, ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. –జేఎం సాయి, జనరల్ మెడిసిన్, సీహెచ్‌సీ, భీమడోలు


