మరో రెండు కోతలు రావాలి
ప్యాకెట్ కారానికి అలవాటు
తాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డుకు ఎండుమిర్చి దిగుమతులు వస్తున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలు ముగియడంతో భారీగా మిర్చి ఈ మార్కెట్ యార్డుకు చేరుకుంటుంది. రాముని కల్యాణం తర్వాతే కొత్త పచ్చళ్లు పట్టేందుకు ఎక్కువగా ప్రజలు మక్కువ చూపుతుంటారు. దీంతో ప్రధానంగా ఖమ్మం, వేలేరుపాడు, వరంగల్, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, కొయ్యలగూడెం, దేవరపల్లి, కొవ్వూరు ప్రాంతాల నుంచి మిర్చి ఇక్కడకు దిగుమతి చేస్తున్నారు. గతంలో గుంటూరు నుంచి కూడా ఎండుమిర్చి వచ్చేది. అయితే, అక్కడ మార్కెట్ పుంజుకోవడంతో ఆ ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతులు తగ్గాయి. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ప్రధానంగా దేశవాళీ, ఉత్తరాది ఎండుమిర్చి రకాలు దిగుమతి అవుతుంటాయి. పచ్చళ్లు, నిల్వ కారానికి ఈ ఎండుమిర్చిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో ఇక్కడి వ్యాపారులు సైతం ఈ మిర్చి కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. ఆయా ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడంతో మార్కెట్‌కు ఎండుమిర్చి దిగుమతి గతంలో పోల్చుకుంటే తగ్గిందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎండుమిర్చి ధర పెరిగిందని చెబుతున్నారు. దేశవాళీ రకం కిలో రూ.400 నుంచి రూ.450కు విక్రయిస్తున్నారు. ఉత్తరాది రకాలు కిలో రూ.700 వరకు ధర పలుకుతున్నాయి. ఆవకాయ సీజన్ కావడంతో ఈ ప్రాంత వాసులు ఘాటు తక్కువగా ఉన్న ఉత్తరాది రకాలను వినియోగిస్తారు. ధర జాస్తిగా ఉండటంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మార్కెట్‌కు వచ్చే సరికి కల్తీ జరుగుతుందని భావించిన పలువురు కొనుగోలుదారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి పచ్చడి కారం మిర్చిని కొనుగోలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ కారణంగానే మార్కెట్ వద్ద కొనుగోళ్లు తగ్గాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
ఉత్తరాది ఎండుమిర్చి రకం
వరంగల్ సన్నాల రకం
గూడెం ఏఎంసీకి ఎండుమిర్చి రాక
పంట తగ్గడంతో పెరిగిన ధరలు
కిలో రూ.450 నుంచి రూ.700 వరకు ధర
ధర ఆశాజనకంగా ఉందంటున్న రైతులు
కొనుగోళ్లు లేవంటున్న వ్యాపారులు
ఎకరం పంటకు పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావా ల్సి ఉంది. మొదటి కోతలో మూడు క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. మరో రెండు కోతల పంట రావాల్సి ఉంది. అయితే, ఎంత వస్తుందనేది తెలియని పరిస్థితి. గతంలో పోల్చుకుంటే దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు పెట్టుబడులు పెరిగాయి.
– పల్లా వెంకటరమణ, రైతు, వేలేరుపాడు మండలం
ఎండుమిర్చి కొని, ఆడించేందుకు 75 శాతం మంది వినియోగదారులు ఆసక్తి చూ పడం లేదు. ప్యాకెట్ కారానికి అలవాటు పడ్డారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు తక్కువ నాణ్యత కలిగిన మిర్చిని కొనుగోలు చేసి కారాన్ని ఆడిస్తున్నారు. రంగు ఆకర్షణీయంగా ఉండటంతో వాటినే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.
–ప్రగడ శ్రీను, వ్యాపారి, తాడేపల్లిగూడెం


