రహదారి భద్రత.. అందరి బాధ్యత
భీమవరం: ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవం–2026లో భాగంగా శనివారం స్థానిక పాత బస్టాండ్ వద్ద నుంచి జిల్లా రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్‌థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్న అనంతరం కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు హైఎండ్ టెక్నాలజీతో రూపొందించిన హెల్మెట్‌ను పరిశీలించి కలెక్టర్ అభినందించారు. మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. ఏఎస్పీ వి.భీమారావు, జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్‌ఎంవీ కృష్ణారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంవీఐలు పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని 39వ వార్డు దుర్గాపురం బీవీరాజు మున్సిపల్ స్కూల్ వద్ద స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా జరిగిన కా ర్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టర్ స్వయంగా చీపురు పట్టి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేశారు.
పాస్ పుస్తకాల జారీపై.. రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లు, సచివాలయ సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.


