నాణ్యత ‘తారు’మారు
తణుకు అర్బన్: గుంతలు పడ్డ రహదారులకు పండుగ షోగా చేస్తున్న పనులు నాసిరకంగా ఉన్నా యని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 1,568 కిలోమీటర్ల మేర వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగా తణుకులోని ఉండ్రాజవరం రోడ్డులో చేస్తున్న తారు ప్యాచ్‌వర్కు పనుల్లో నాణ్యత లోపం స్పష్టం కనిపిస్తోంది. వార్షిక నిర్వహణలో భాగంగా ఈ రోడ్డులో రూ.3 లక్షల నిధులతో ప్యాచ్‌వర్కు పనులు శుక్రవారం చేపట్టారు. అయితే గోతుల్లో పూర్తిస్థాయిలో మట్టి శుభ్రం చేయలేదని, గొయ్యి చిన్నదైనా ప్యాచ్ పెద్దదిగా చూపిస్తున్నారని, గొయ్యి ప్రాంతంలో నాలుగు పక్కలా కట్ చేయకుండా ఉల్లిపొర మాదిరిగా తారు కలిపిన చిప్స్ వేస్తున్నారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మట్టిపైనే తారు వేయడంతో ఈ ప్యాచ్‌లు పెద్ద పండుగ వరకు అయినా ఉంటాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
రూ.10 లక్షల పనులు : ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి రోడ్డు, ఆర్వోబీ, పైడిపర్రు ప్రాంతాల్లో రూ.10 లక్షల నిధులతో వేసిన ప్యాచ్ వర్కు పనులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రెండు నెలల్లోనే ప్యాచ్‌వర్కు పనులు ఛిద్రమై రాళ్లు బయటకురాగా, తాజాగా ఇక్కడ పనులు చేసిన ఆనవాళ్లే కనిపించకపోవడం విశేషం. చంద్రబాబు సర్కారులో చేస్తున్న ప్యాచ్‌వర్కు పనుల్లో ఉన్న డొల్లతనాన్ని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. సంక్రాంతి పండుగలోపు రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పారని మొదటి ఏడాదిలోపు వేసిన ప్యాచ్‌వర్కు పనులు రెండో ఏడాది పండుగకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని, రెండో ఏడాది పండుగ వస్తుండగా ఉండ్రాజవరం రోడ్డులో వేస్తున్న ప్యాచ్‌వర్కు పనులు ఎంతకాలం ఉంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ పనులపై ఆర్‌అండ్‌బీ విభాగ ఏఈ యశ్వంత్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా గతంలో చేసిన రూ.10 లక్షల ప్యాచ్‌వర్కు పనులకు తిరిగి మరమ్మతులు చేస్తామని, తాజాగా ఉండ్రాజవరం రోడ్డులో వేస్తున్న వార్షిక నిర్వహణ పనులు తమ సిబ్బంది పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని, ప్యాచ్‌వర్కు చేసేప్పుడు రోడ్డును కట్ చేసేందుకు కూలీల కొరతతో ఇబ్బందులు వచ్చాయని, ఇకపై కట్ చేసే ప్యాచ్‌వర్కు చేస్తామని చెప్పారు.
పండుగ షో
నాసిరకంగా రోడ్డు మరమ్మతులు
ఉల్లి పొరలా ప్యాచ్ వర్కు
పనులపై ప్రజల పెదవివిరుపు


