పుష్కరాలకు కార్యాచరణ
భీమవరం (ప్రకాశంచౌక్): గోదావరి పుష్కరాలకు జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గోదావరి పుష్కరాలు, కొల్లేరు గ్రామాల సరిహద్దుల గుర్తింపు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. సీఎస్ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు నిర్వహించనున్నారన్నారు. ఈ మేరకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కొల్లేరుపై సమీక్ష చేస్తున్న సందర్భంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యంలో ఆకివీడు మండలంలో 10 గ్రామాలు ఉన్నాయని, 5 గ్రామాల సరిహద్దులను గుర్తించామని, మరో 5 గ్రామాల సరిహద్దుల సర్వే సత్వరమే పూర్తి చేస్తామన్నారు. అలాగే అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో బృందాన్ని ఏర్పాటుచేసి కొల్లేరులో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చట్టవిరుద్ధంగా సాగు చేస్తున్న ఆక్వా చెరువులను గుర్తించి సర్వే ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


