బాబు నోట.. ఆరుసార్లు అదే మాట
చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేయాలి
అడుగు ముందుకు కదల్లేదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలవోకగా చెప్పేది చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తిచేస్తాం అనే మాట. గతేడాది ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు ఇప్పటికి ఆరుసార్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఆరుసార్లు ఇదేమాట చెప్పారు. ఈనెల 1న ఉంగుటూరులో జరిగిన పింఛన్ల పంపిణీ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ‘చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. చింతలపూడి, నూజివీడు లాంటి మెట్ట ప్రాంతాలను సస్యశామలం చేస్తాం. ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఇది మా ప్రభుత్వ ప్రాధాన్యత..’అని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ ప్రాజెక్టు పనుల కోసం తీసుకున్న చర్యలే లేవు.
2008లో వైఎస్సార్ శ్రీకారం
గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు తరలించాలనే సంకల్పంతో 2008 అక్టోబర్ 30న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. జలయజ్ఞంలో భాగంగా రూ.1,701 కోట్లతో అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మించి రెండులక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని పనులు చేపట్టారు. వైఎస్సార్ హఠాన్మరణంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. మళ్లీ 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్ట్ వ్యయాన్ని భారీగా పెంచి అదనపు ఆయకట్టును దీని పరిధిలోకి తెచ్చేలా మార్పులు చేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.4,909.80 కోట్లకు పెంచి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు తాగు, సాగునీరు ఇచ్చేలా రూపొందించారు. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భూ సేకరణ సమస్యలు చెప్పి ఈ ప్రాజెక్టును అటకెక్కించారు. 2024 ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఎన్నిసార్లు హామీలు ఇచ్చారో లెక్కేలేదు. ఏలూరు, చింతలపూడి, నూజివీడు, దెందులూరు.. ఇలా అన్ని నియోజకవర్గాల్లోను ఎన్నికల సభల్లో అధికారంలోకి వస్తే వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు.
ఒట్టి మాటలే
ఉమ్మడి జిల్లాకు వచ్చిన ప్రతిసారీ చింతలపూడి ఎత్తిపోతలు పూర్తిచేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు
ఎన్నికల సమయంలో ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు
అడుగు ముందుకు పడని ప్రాజెక్టు పనులు
గతంలో సీఎంగా ఉన్నప్పుడే అంచనా వ్యయం భారీగా పెంచిన చంద్రబాబు
జలయజ్ఞంలో ప్రాజెక్టుకు శంకుస్థాపనచేసిన దివంగత సీఎం వైఎస్సార్
రైతులకు ఆమోదయోగ్యమైన నష్టపరిహారం ఇచ్చి ప్రాజెక్ట్ పనులు వెంటనే ప్రారంభించాలి. ఎన్నికలకు ముందు పదేపదే హామీలిచ్చిన చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టకపోవడం సరికాదు.
– కంభం విజయరాజు, వైఎస్సార్‌సీపీ
చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జ్
2024లో సీఎం అయిన తరువాత చంద్రబాబు ఆగిరిపల్లి, పోలవరం, ఏలూరు, కై కలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చిన ప్రతిసారి.. 2026 జూన్‌కల్లా చింతలపూడి పూర్తిచేస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.222 కోట్లు కేటాయించినా.. ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పినా.. క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపలేదు. ప్రధానంగా చింతలపూడి నియోజకవర్గంలో 14 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ విషయంలో ఇబ్బందులున్నాయి. కాలువ కోసం భూమి కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.19 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఈ సమస్య తీరలేదు.
బాబు నోట.. ఆరుసార్లు అదే మాట


