కలెక్టరేట్‌ ఊసేది? | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఊసేది?

Dec 20 2025 9:20 AM | Updated on Dec 20 2025 9:20 AM

కలెక్టరేట్‌ ఊసేది?

కలెక్టరేట్‌ ఊసేది?

విరుద్ధ ప్రకటనలతో హైడ్రామా

సాక్షి, భీమవరం: కలెక్టరేట్‌కు అనుమతులొచ్చేశాయి. భూమి పూజే తరువాయి అంటూ ఒక నేత ప్రకటిస్తే.. కలెక్టరేట్‌ భీమవరం దాటిపోదంటూ మరో నేత.. మిగిలిన వారిది తలోమాట.. రెండు నెలల క్రితం కూటమిలో కాక రేపిన కలెక్టరేట్‌ అంశం తెరమరుగైపోయింది. నాయకులు సైలెంట్‌ అయిపోగా శాశ్వత భవనం ఎప్పుడు? ఎక్కడ కడతారో ? జిల్లావాసులకు ప్రశ్నగానే మిగిలిపోయింది.

గత ప్రభుత్వంలో 20 ఎకరాల కేటాయింపు

పాలనా సౌలభ్యం, మెరుగైన సేవల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన లో భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి ఆవిర్భవించింది. పట్టణంలోని ప్రైవేట్‌ కళాశాల భవనంలో తాత్కాలిక కలెక్టరేట్‌ను ఏర్పాటుచేశారు. అన్ని శాఖలు ఒకేచోట ఉండేలా శాశ్వత ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనం కోసం ఏఎంసీ యార్డులో 20 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ రికార్డుల్లో మార్పులుచేసి 2023 మార్చిలో జీఓ 124ను విడుదల చేశారు. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో భవన నిర్మాణానికి అప్పట్లోనే అడుగులు వేసినప్పటికి ఈలోపు సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలుకావడంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రాగా ఈ అంశం మరుగునపడిపోయింది.

రోడ్డెక్కిన ప్రజలు

కలెక్టరేట్‌ను భీమవరంలోనే నిర్మించాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్థానికులు రోడ్డెక్కి ధర్నాలు, శాంతియుత ప్రదర్శనలు చేశారు. అప్పట్లో భీమవరంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్‌ నిర్మాణం చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

వైఎస్సార్‌సీపీది స్పష్టమైన వైఖరి

కలెక్టరేట్‌ భవనాన్ని భీమవరంలోనే నిర్మించాలని వైఎస్సార్‌సీపీ తన స్టాండ్‌ను ప్రకటించింది. ఏఎంసీలోనే నిర్మించాలని పార్టీ భీమవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ చినమిల్లి వెంకటరాయుడు, పార్టీ నేతలు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ నిర్మాణం విషయమై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు కూటమి నేతలకు హితవుపలికారు. గతంలో ఏఎంసీలో కేటాయించిన 20 ఎకరాలతో పాటు అవసరమైతే పట్టణంలో అనువైన ప్రభుత్వ భూములను సైతం ఆయన సూచించారు.

కూటమి కప్పదాట్లు

రెండు నెలల క్రితం కూటమిలో కాకరేపిన కలెక్టరేట్‌

నిర్మాణ స్థలంపై నేతల విరుద్ధ ప్రకటనలు

నేతల వైఖరితో ప్రజల్లో గందరగోళం

ప్రశ్నగానే కలెక్టరేట్‌ నిర్మాణం

భవనం కోసం భీమవరంలో 20 ఎకరాలు కేటాయించిన గత ప్రభుత్వం

రూ.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ భవన నిర్మాణానికి అప్పట్లోనే టెండర్లు

భీమవరం పక్కనే పెద అమిరంలోని 3.6 ఎకరాల ఇరిగేషన్‌ స్థలంలో కలెక్టరేట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది ఆగస్టులో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు చేసిన ప్రకటన కూటమిలో కలకలం రేపింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని, సర్వే నంబర్‌ భీమవరంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్‌ భవనానికి మూడు, లేక నాలుగు ఎకరాల స్థలం సరిపోదన్నారు. భీమవరంలో 25 ఎకరాల స్థల సేకరణకు దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, తాడేరు రోడ్లలో అనువైన స్థలం చూస్తున్నట్టు చెప్పారు. కలెక్టరేట్‌ భవనం కోసం విశాలమైన స్థలం అవసరమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, భీమవరం పరిసరాల్లోనే భవన నిర్మాణం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణం ఎక్కడ జరుగుతుందనే విషయమై పందేలు జరుగుతున్నట్టు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కొద్దిరోజుల పాటు హైడ్రామానే నడిచింది. తర్వాత నేతలంతా సైలెంటైపోయారు. మూడు నెలలుగా ఆ ఊసే లేదు. కలెక్టరేట్‌ నిర్మాణం ఎక్కడ? ఎప్పుడు నిర్మించేది స్పష్టత లేకుండా మిస్టరీగానే మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement